బీజింగ్ : ఎట్టకేలకు చైనాలోని ఒక నగరం కీలక నిర్ణయం తీసుకుంది. కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో చైనా లోని షెన్‌జైన్ నగరంలో కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసం తినడాన్ని నిషేధం విధించింది. అంతేకాదు ప్రస్తుత వైరస్ వ్యాప్తి ప్రారంభంలో చైనా ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక నిషేధానికి మించి అడవి జంతువుల వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించింది. కుక్క, పిల్లి మాంస విక్రయాలకు ప్రత్యేకతగా చెప్పుకునే షెన్జెన్ నగరంలో కుక్క, పిల్లి , పాములు, బల్లుల మాంసం వినియోగాన్ని నిషేధించింది. మే 1 నుండి ఈ నిషేధం అమల్లోకి వచ్చేలా నిబంధనలను ప్రవేశపెట్టింది. 'ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం' అని గుర్తించామని అధికారులు ప్రకటించారు.
పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్‌జెన్ అవతరించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘింస్తే జరిమానా భారీగానే వుంటుంది. స్వాధీనం చేసుకున్న జంతువుల విలువను బట్టి గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న నగరంగా షెన్‌జెన్ రికార్డుల కెక్కింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ మహమ్మారి నుండి నేర్చుకున్న పాఠాలను తీవ్రంగా పరిగణించి, మరొక మహమ్మారిని నివారించడానికి అవసరమైన మార్పులు చేసిన మొట్టమొదటి నగరం షెన్‌జెన్ అని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ వన్యప్రాణి విభాగం ఉపాధ్యక్షుడు తెరెసా ఎం.టెలికీ అన్నారు. క్రూరమైన వాణిజ్యాన్ని అంతం చేసే ప్రయత్నాలలో షెన్‌జెన్ విధించిన నిషేధం అభినంద నీయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చైనాలో 10 మిలియన్ కుక్కలు , 4 మిలియన్ పిల్లుల మాంసాన్ని విక్రయిస్తారని అంచనా వేశారు.
కాగా సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో గత ఏడాది డిసెంబరులో మొట్టమొదట కరోనా వైరస్ ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్‌జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment