బీజింగ్ : చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత చైనాలో బీభత్సం సృష్టించిన కరోనా.. ఆ తర్వాత బయటి దేశాలకు పాకింది. ముఖ్యంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాల్లో కరోనా విజృంభణ ఆగడం లేదు. మరోవైపు కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అక్కడ రోజురోజుకు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. మూడు రోజుల తర్వాత ఓ స్థానికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 54 మందికి కరోనా సోకింది. దీంతో ఆందోళన చెందిన అధికారులు విదేశీ మిమాన సర్వీసులను నిలిపివేశారు. కాగా, గురువారం మొత్తంగా చైనాలో 55 కరోనా కేసులు నమోదైనట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
చైనాలో ఇప్పటివరకు 81,340 మందికి కరోనా సోకింది. మృతుల సంఖ్య 3,292కు చేరింది. విదేశాల నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో స్వదేశానికి తిరిగివస్తున్న చైనీయులే అధికంగా ఉన్నారు. ఇది అధికార యంత్రాంగంలో ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు తొలి కరోనా కేసు నమోదైన హుబేయ్ ప్రావిన్స్‌లో మాత్రం గురువారం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. గత కొద్ది రోజులుగా చైనాలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే కరోనా కట్టడిలో చైనా విజయం సాధించినట్టుగా కనిపిస్తోంది.
యూఎస్, ఇటలీ, స్పెయిన్‌లో భయానక పరిస్థితులు..
కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా చైనాను దాటేసింది. అయితే అమెరికాలో మృతుల నిష్పత్తి మాత్రం చైనాతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. మరోవైపు స్పెయిన్, ఇటలీలో మృతుల నిష్పత్తి ఎక్కువగా ఉంది. దీంతో ఆయా దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
► యూఎస్‌లో 85,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,300 మంది మృతిచెందారు.
► ఇటలీలో 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 8,215 మంది మృతిచెందారు.
► స్పెయిన్‌లో 57,786 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 4,365 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment