![As Covid 19 Deceased Count Rises Bed That Converts Into Coffin - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/23/colombia.gif.webp?itok=xG3eHGbZ)
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా ఖననం చేసిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. దక్షణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోనూ మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ను కలచివేశాయి. ఆస్పత్రి పడకలనే శవపేటికలుగా మార్చే ఆవిష్కరణకు దారిచూపాయి. ఈ విషయం గురించి రొడాల్ఫో మాట్లాడుతూ.. ‘‘ ఈక్వెడార్‌లోని గ్వాయేకిల్‌లో మృతదేహాలతో కొంతమంది వీధుల్లోకి వచ్చారు. మహమ్మారి కారణంగా అంత్యక్రియలు కూడా సరైన పద్ధతిలో నిర్వహించుకునే వీల్లేకుండా పోయింది. అందుకే శవపేటికలుగా రూపాంతరం చెందే బెడ్లను తయారుచేశాం’’అని తెలిపారు.(‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’)
‘‘ఈ బెడ్లకు మెటల్ రెయింగ్స్ ఉంటాయి. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు అమర్చాం. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. ఈ బయోగ్రేడబుల్ బెడ్- కఫిన్స్ 92 నుంచి 132 డాలర్ల ధరలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీంతో మృతదేహం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. తొలుత కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆస్పత్రికి ఈ బెడ్లను విరాళంగా ఇస్తున్నామని రొడాల్పో తెలిపారు. బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కొలంబియా, ఈక్వెడార్‌లతో పాటు పెరూ, చిలీ, బ్రెజిల్, మెక్సిక్, యూఎస్‌కు వీటిని ఎగుమతి చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.(అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!)
Comments
Please login to add a commentAdd a comment