వాషింగ్టన్: హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను భారత్ తమకు పంపించనట్లయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని(వాణిజ్య పరంగా) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని... అవి అలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నామన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో మలేరియా వ్యాధిని అరికట్టే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల వాడకం సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తున్న తరుణంలో తమకు వాటిని ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో చర్చలు జరిపారు.
ఇక కోవిడ్-19 అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ట్రంప్ సోమవారం శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులను భారత్ నిషేధించిన విషయం గురించి విలేకరులు ట్రంప్ ముందు ప్రస్తావించారు. ఇందుకు బదులుగా.. ‘‘ఇతర దేశాలకు మోదీ ప్రభుత్వం ఎగుమతులను(టాబ్లెట్లు) నిలిపివేసిందని తెలుసు. అయితే నేను ఆదివారం మోదీకి ఫోన్ చేశాను. మా సంభాషణ ఎంతో బాగా సాగింది. చాలా ఏళ్లుగా భారత్ వాణిజ్యపరంగా అమెరికా వల్ల అనేక ప్రయోజనాలు పొందింది. అలాంటి మాకు కూడా భారత్ ఆ మాత్రలు పంపకూడదు అనుకుంటే.. ఆ విషయం ముందే చెప్పాలి. ఒకవేళ అదే గనుక ఆయన నిర్ణయం అయితే.. మరేం పర్లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా ఉంటాం. కచ్చితంగా అందుకు కౌంటర్ ఇస్తాం’’ అని ట్రంప్ సమాధానమిచ్చారు. అదే విధంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కరోనా గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించిన ట్రంప్.. కోవిడ్-19 బాధితులకు దాని అవసరం ఎంతగానో ఉందన్నారు.
కాగా భారత్‌లోనూ ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా.. క్లోరోక్విన్ ఎగుమతుల్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. అయితే అంతకుముందే అమెరికా ఈ మందుల కోసం ఆర్డర్ చేసింది. ఇక ప్రస్తుతం అమెరికాలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఇప్పటికే అక్కడ 10 వేల మందికి పైగా మరణించగా కేవలం న్యూయార్క్‌లోనే 4,758 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ తరుణంలో భారత్ చేసే సహాయం అమెరికాకు ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తుందా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉండేందుకు అమెరికా 2.9 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: అమెరికా బాటలో మరో 30 దేశాలు
Comments
Please login to add a commentAdd a comment