‘ఊహించని పరిస్థితులు’.. ట్విటర్‌ కీలక నిర్ణయం! | Covid 19 Twitter Orders Staff To Work From Home | Sakshi
Sakshi News home page

తీవ్ర భయాల నేపథ్యంలో ట్విటర్‌ కీలక నిర్ణయం!

Published Thu, Mar 12 2020 2:46 PM | Last Updated on Thu, Mar 12 2020 3:14 PM

Covid 19 Twitter Orders Staff To Work From Home - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా భయాల నేపథ్యంలో ప్రముఖ మేసేజింగ్‌ యాప్‌ ట్విటర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విటర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాణాంతక కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్‌ మానవ వనరుల విభాగం చీఫ్‌ జెన్నిఫర్‌ క్రైస్ట్‌ బుధవారం వెల్లడించారు. కాగా, గత డిసెంబర్‌లో చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఈ వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 4,600 మంది ప్రాణాలు కోల్పోగా లక్షా 26 వేలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్‌-19ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
(కోవిడ్‌ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ)

కాగా, వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ట్విటర్‌ నెల క్రితమే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ‘వైరస్‌ ప్రభావిత ప్రాంతాల ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని గతంలో స్పష్టం చేశాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాతున్న క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నాం. ఇది ఊహించని నిర్ణయమే.. కానీ ప్రస్తుత పరిస్థితులు కూడా ఊహించని విధంగానే ఉన్నాయి’అని  జెన్నిఫర్‌ క్రైస్ట్‌ పేర్కొన్నారు.
(చదవండి: అలా కరోనా వైరస్‌ను జయించాను!)

ఇక మిగతా ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులు వైరస్‌ బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నాయి. సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లో ఉన్న తన కార్యాలయాలకు ఉద్యోగులు రానవసరం లేదని గూగుల్‌ ఇదివరకే ప్రకటించగా.. యాపిల్‌ సంస్థ కూడా ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అవకాశం కల్పించింది. ఇక సింగపూర్‌, లండన్‌లలో ఉన్న తన కార్యాలయాలలో సంపూర్ణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఫేస్‌బుక్‌ వాటిని తాత్కాలికంగా మూసేసింది. ఈ రెండు కార్యాలయాల్లో పనిచేసిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక చైనాలో ట్విటర్‌కు బదులు స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘వీ చాట్‌’ వంటివి ఉన్న సంగతి విదితమే.
(ఐపీఎల్‌ : ఏప్రిల్‌ 15 వరకు ఆ ఆటగాళ్లు దూరం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement