భాషా ముఖర్జీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ దీన్ని అడ్డుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. పరిపాలనా, పోలీసు, రక్షణ వ్యవస్థలతోపాటు ముఖ్యంగా వైద్యులు, నర్సులు, సానిటేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను నిబద్దతగా పాటిస్తూ ప్రజలు, భారీ విరాళాలతో కార్పొరేట్ దిగ్గజాలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో మిస్ ఇంగ్లాండ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. 2019లో అందాల రాణిగా నిల్చిన భాషా ముఖర్జీ (24) కరోనా బాధితులను ఆదుకునేందుకు సామాజిక బాధ్యత తీసుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా బారిన పడ్డ రోగులకు సేవలందించేందుకు మళ్లీ వైద్య వృత్తిని చేపట్టారు ఈమె భారతీయ సంతతికి చెందిన వారు కావడం మరో విశేషం.
భాషా ముఖర్జీ కోల్‌కతాలో జన్మించారు. ఆమెకు ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె కుటుంబం ఇంగ్లాండ్ కు వలసవెళ్లింది. అక్కడే విద్యాభ్యాసం చేసిన భాషా వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నారు. అనంతరం శ్వాసకోశ వైద్యంలో ప్రత్యేకతను సాధించారు. అయితే ఆసక్తికరంగా బ్యూటీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె గత ఏడాది ఆగస్టులో మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని అందుకున్నారు. కిరీటం గెలిచుకున్న తరువాత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనే యోచనలో తన వైద్యవృత్తి నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆఫ్రికా, టర్కీ, భారతదేశంలో పర్యటిస్తున్నారు. మరిన్ని దేశాలను సందర్శించాలని కూడా అనుకున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇంగ్లాండ్ లో కరోనా వైరస్ విస్తరణ మరింత ఆందోళనకరంగా మారడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇది పెద్ద కఠిన నిర్ణయమేమీ కాదు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. మార్చి ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ లో కరోనా క్రమంగా విజృంభిస్తోంది. రెండు లేదా మూడు వారాలుగా ఈ మార్పులను గమనిస్తున్నాను. తూర్పు ఇంగ్లాండ్ బోస్టన్లో ఉన్న పిలిగ్రిమ్ ఆసుపత్రిలోని వివిధ భాగాల్లో నా సహచరులు నిరంతరం సేవలందిస్తున్నారు. ఇంతకుముందెన్నడూ చేపట్టని బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు. అందుకే తన పర్యటనను వాయిదా వేసుకొని తాను కూడా టాస్క్‌ఫోర్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు వారాల భారతదేశ పర్యటనలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని భాషా బుధవారం యూకేకు తిరిగి వెళ్లారు. అంతేకాదు ఆసుపత్రి బాధ్యతలను స్వీకరించే ముందు ఒకటి, రెండు వారాల వరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండనున్నానని వెల్లడించారు. ఇంగ్లాండ్కు సహాయం చేయడానికి తనకు ఇంతకన్నా మంచి అవకాశం రాదని భాషా ముఖర్జీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment