ధూమపానం కన్నా మనోవ్యాధులే డేంజర్..
మానసిక అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ధూమపానం కన్నా ప్రమాదకరం అంటున్నారు ఆక్స్‌ఫర్డ్‌వర్సిటీ శాస్త్రవేత్తలు. మానసిక అనారోగ్యం వల్ల జీవితకాలం సగటున 10 నుంచి 20 ఏళ్ల వరకూ తరిగిపోతుందని, అది ధూమపానం వల్ల తరిగిపోయే ఆయుర్ధాయం కన్నా ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలు, ఆల్కహాల్ వినియోగం, ధూమపానం వంటి వాటి వల్ల మరణించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అన్న కోణంలో 17 లక్షల మందిపై, 2.50 లక్షల మరణాలపై జరిగిన 20 పరిశోధనల ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ సైకియాట్రిస్టులు అధ్యయనం చేశారు.
వీరి తాజా అంచనాల ప్రకారం.. బైపోలార్ డిజార్డర్ వల్ల 9-10 ఏళ్లు, స్కిజోఫ్రీనియా వల్ల 9-20 ఏళ్లు, మళ్లీమళ్లీ వచ్చే డిప్రెషన్ వల్ల 7-11 ఏళ్లు జీవితకాలం తగ్గుతుందట. అలాగే డ్రగ్స్, ఆల్కహాల్ సేవనం వల్ల 9-24 ఏళ్లు, హెవీ స్మోకింగ్ వల్ల 8-10 ఏళ్లు ఆయుర్దాయం హరిస్తుందట. అయితే.. మానసిక రోగుల్లో అతిప్రవర్తన వల్ల కూడా ముప్పు ఏర్పడి చనిపోయే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.