
డార్క్ చాకొలెట్లతో ఒత్తిడికి చెక్
లాస్ ఏంజెలిస్: వయసు మీదపడటం వల్ల తలెత్తే ఒత్తిడి, నాడీ సంబంధ సమస్యలకు డార్క్ చాకొలెట్లు మంచి ఔషధంగా పనిచేస్తాయని పరిశోధకులు గుర్తించారు. వీటిలోని ఎపికెటెచిన్(ఎపి) అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడుతో పాటు ఇతర నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు ఆందోళన స్థాయిలు తగ్గినట్లు వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో కనుగొన్నారు.
అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో డార్క్ చాకొలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిర్ధారణకు వచ్చారు. వయసు మీద పడ్డ ఎలుకలకు ఎపికెటెచిన్ ఇచ్చి ఒత్తిడి, నాడిమండల వ్యవస్థల్లో మార్పుల్ని గమనించారు. వాటిలో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు, ఆందోళన స్థాయిలు తగ్గినట్లు పరిశోధకులు గమనిం చారు. డార్క్ చాకొలెట్లు తినేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండడానికి కారణాలపై ఈ పరిశోధనతో కొంత స్పష్టత వచ్చిందన్నారు.