
ప్రధాని, ప్రెసిడెంట్ కలిసి మందేశారు
క్యాడ్సన్: ఎప్పుడూ నిత్యం తీరికలేని కార్యకలాపాలతో చిరాకుగా అనిపించిందో లేక తాము కూడా ఓసారి సామాన్య పౌరుల్లా గడిపేయాలనుకున్నారో.. ఏకంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కలిసి నాలుగు సిప్‌ల బ్రిటన్ సాంప్రదాయబద్ధమైన మత్తుపానీయం సేవించారు. ఈ విషయాన్ని డేవిడ్ కామెరూన్ స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా గురువారం జీజిన్ పింగ్ గురువారం కామెరూన్‌ను కలిశారు.
అనంతరం వారిద్దరూ కలిసి క్యాడ్సన్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అక్కడ స్వయంగా బిల్లు చెల్లించి మూడు క్వార్టర్ల 'ట్రెడిషనల్ ఇంగ్లిష్ బిట్టర్' సేవించారు. అనంతరం బ్రిటన్‌లో ఫేమస్ అయిన చేపలను, చిప్స్‌ను లొట్టలు వేసుకుంటూ తిన్నారు. వారిద్దరిని అక్కడ చూసి బార్‌లో ఉన్న మిగితా వారు ఆశ్చర్యపోగా.. ఆ బార్ షాపు యజమాని మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఓ ప్రధాని, అధ్యక్షుడు తన బార్ పబ్‌లో బిట్టర్ తీసుకోవడం, చేపలు, చిప్స్ తినడం తన జీవితంలోనే గొప్ప సంతోషకరమైన రోజంటూ ఆనందం వ్యక్తం చేశాడు.