న్యూఢిల్లీ : మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను ఎక్కడికక్కడ స్థంభింపచేస్తున్నా డ్రగ్స్ సహా అజ్ఞాత కార్యకలాపాల ద్వారా ఆర్జిస్తున్న మొత్తాన్ని ఆయన పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్‌ఎక్స్)లో పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడైంది. పలు క్యాపిటల్ సెక్యూరిటీ సంస్థల ద్వారా దావూద్ ఇబ్రహీం తన రాబడులను పీఎస్‌ఎక్స్ పరిధిలోని మూడు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో మదుపు చేస్తున్నాడు. పీఎస్‌ఎక్స్‌లో దావూద్ తన అక్రమ నిధులను పెట్టుబడి పెట్టడం పట్ల భారత నిఘా సంస్ధలు కీలక ఆధారాలను రాబట్టినట్టు సమాచారం.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధ లావాదేవీలు, నకిలీ భారత కరెన్సీ నోట్ల రాకెట్, దోపిడీ దందాల ద్వారా దావూద్ పెద్దమొత్తంలో డబ్బు కూడబెడుతున్నాడు. దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ప్రస్తుతం లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్న జబీర్ మోతీకి చెందిన ఐదు క్యాపిటల్ సెక్యూరిటీ కంపెనీలు ప్రస్తుతం పీఎస్‌ఎక్స్ పరిధిలో ఉండగా, వీటి ద్వారా దావూద్ తన పెట్టుబడులను షేర్ మార్కెట్‌లోకి మళ్లించినట్టు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని ప్రముఖ షేర్ బ్రోకింగ్ కంపెనీ హబీబ్ బ్యాంక్ సబ్సిడరీ హబీబ్ మెట్రపాలిటన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా పలు షెల్ కంపెనీల పేరుతో దావూద్ గ్యాంగ్ షేర్ మార్కెట్‌లోకి నిధులను మళ్లించింది. హబీబ్ బ్యాంక్ ఉన్నతాధికారులను దావూద్‌కు పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్, దావూద్ కుమార్తె మెహ్రీన్ మామ పరిచయం చేసినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హబీబ్ బ్యాంక్‌పై మనీ ల్యాండరింగ్ సహా ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తుందని 2017లో అమెరికా ఆర్థిక సేవల శాఖ ఆరోపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment