కేసినోలకు, నైట్ క్లబ్‌లకు ఫేమస్ అయిన లాస్‌వెగాస్‌లో నరమేధం సృష్టించాడో రాక్షసుడు. విశాల ప్రాంగణంలో జేసన్ ఆల్డీన్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్న భారీ జనసముదాయంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఉన్న ఒక హోటల్‌లోని 32వ అంతస్తులోని తన గదిలోని కిటికీ నుంచి తాపీగా కిందనున్న అమాయక ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించాడు.
ఎక్కడినుంచి దూసుకొస్తున్నాయో తెలియని బుల్లెట్లు శరీరాల్ని ఛిద్రం చేస్తోంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి ప్రజలు సురక్షిత ప్రదేశం కోసం పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో 5 వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ మారణకాండకు పాల్పడిన, స్థానికుడైన స్టీఫెన్ పెడాక్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణాన్ని ఎఫ్‌బీఐ తోసిపుచ్చగా.. ఈ కాల్పులకు పాల్పడింది తమ సైనికుడేనని ఐసిస్ ప్రకటించింది.
లాస్‌వెగాస్: అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్‌లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. పైనుంచి కాల్పులు జరగటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటుపోవాలో తెలియక బాధితులు తోచిన వైపు పరుగులు తీశారు. ఉన్మాది మారణకాండతో సంగీతవిభావరి ఆర్తనాదాలతో మార్మోగిపోయింది.
ఈ ఘటనలో 500 మందికి పైగా గాయాలయ్యా యి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కారకుడైన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ (64) అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని, కొద్ది నెలల క్రితమే పెడాక్ ఇస్లాం మతం స్వీకరించాడని ఐసిస్ పేర్కొంది. అయితే ఇది ఉన్మాద చర్యేనని.. ఉగ్ర ఘటనగా భావించట్లేదని ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, లాస్‌వెగాస్ బాధితుల్లో భారతీయులెవరూ లేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
‘రూట్ 91’ పేరుతో లాస్‌వెగాస్‌లోని మాండలే బేలో మూడ్రోజుల మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 30వేల మంది సంగీతాభిమానులు చుట్టు పక్కల రాష్ట్రాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కచేరీ ఉత్సాహంగా సాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో కన్సర్ట్‌లో అందరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. దీంతో కన్సర్ట్‌లో కలకలం రేగింది. ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియని గుళ్ల వర్షం నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎత్తైన భవనం పైనుంచి పక్కా వ్యూహంతో జరిపిన ఈ కాల్పులు సంగీతాభిమానుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఎటువెళ్లాలో అర్థం కాక ఆర్తనాదాలతో తలోదిక్కుకు పారిపోయే ప్రయత్నంలో మరింత గందరగోళం నెలకొంది. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు, వైద్యులు పేర్కొన్నారు.
32వ అంతస్తు నుంచి
కన్సర్ట్ వేదిక పక్కనే మాండలే బే కాంప్లెక్స్ ఉంది. ఈ భవనం 32వ అంతస్తులోని హోటల్ గదిలో స్టీఫెన్ పెడాక్ మకాం వేశాడు. ఈ ఘటన కోసం వ్యూహాత్మకంగానే ఎత్తైన భవంతిని పెడాక్ ఎంచుకున్నాడు. ఈయన ఉన్న గది నుంచి కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతం 1700 అడుగుల దూరం (ఏటవాలుగా 518 మీటర్లు) ఉంది. పైనుంచి బుల్లెట్లు దూసుకొస్తుండటంతో కచేరీలో ఉన్న వారికి కూడా ఎటుపోవాలో తోచలేదు. దీని కారణంగానే మృతులు, బాధితుల సంఖ్య పెరిగింది. కాల్పులు పక్కనున్న హోటల్ భవంతి నుంచి వస్తున్నాయని గుర్తించిన పోలీసులు 32వ అంతస్తులోని ఆ గదిలోకి చేరుకునేసరికే.. పెడాక్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.
పోలీసులు ఆ గది నుంచి 10 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఘటన జరిగిన సమయంలో అతనితోపాటు ఓ మహిళ ఉందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనతో ఆ మహిళకు సంబంధం లేదని నిర్ధారించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా ఈ కన్సర్ట్ కాల్పులను పేర్కొన్నారు. ‘ఈ దారుణ ఘటనలో 58 మంది మరణించారు. 200 మంది వరకు గాయపడి ఉంటారని మొదట భావించాం. కానీ 515 మందిని ఆసుపత్రులకు తీసుకెళ్లాం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి లోంబార్డో తెలిపారు. లాస్ వెగాస్‌కు 130కిలోమీటర్ల దూరంలోని మెస్క్విట్ పట్టణంలోని పెడాక్ ఇంటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఇంటినుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గాజు పగిలిందనుకున్నాం!
‘కచేరీలో మునిగిపోయి ఉండగా.. ఒక్కసారి గాజు పగిలిన శబ్దం వచ్చింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే బుల్లెట్లు దూసుకొచ్చాయి. కాసేపటికి కాల్పులు ఆగిపోయాయనుకున్న సమయంలో మళ్లీ బుల్లెట్ల వర్షం మొదలైంది’ అని మోనిక్ డెకెర్ఫ్ అనే బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అమెరికా విఖ్యాత గాయకుడు జేసన్ అల్డీన్ వేదికపై ఉన్నారు. ‘15–20 మంది నా కళ్లముందే చనిపోవటం చూశాన’ంటూ మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చాలా మంది.. ‘కాల్పుల శబ్దం కన్సర్ట్ సౌండ్ ఎఫెక్ట్ లో భాగమనే అనుకున్నాం. క్షణాల్లోనే కన్సర్ట్ మ్యూజిక్ కాదు.. నిజంగానే కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ కన్సర్ట్ ఓ యుద్ధభూమిని తలపించింది. అత్యవసర సిబ్బంది చేతికందిన టేబుళ్లు, మెటల్ రెయిలింగ్‌లను స్ట్రెచర్లుగా వినియోగించి.. బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి
భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని భయంకరమైన దుర్ఘటనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బాధితులకు దేశమంతా అండగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లాస్‌వెగాస్ ఘటనకు సంతాపంగా వైట్‌హౌజ్‌తోపాటుగా ప్రభుత్వ కార్యాలయాలపై అమెరికా జాతీయ జెండాను అవనతం చేశారు. ‘మతిలేని ఈ దుశ్చర్య.. కలచివేసింది’ అని పోప్ ఫ్రాన్సిస్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఘోరమైన దాడిగా అభివర్ణించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. బాధితులకు సానుభూతి తెలిపారు. గతేడాది జూన్‌లో ఫ్లోరిడాలోని పల్స్ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల దుర్ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 2015 నవంబర్‌లో పారిస్‌లోని బాటక్లాన్‌లో జరిగిన ఓ కన్సర్ట్‌పై జరిగిన దాడిలో 90 మంది మృతిచెందారు.
అది మా పనే: ఐసిస్
మ్యూజిక్ కన్సర్ట్‌పై కాల్పుల ఘటనకు తమదే బాధ్యతని ఐసిస్ పేర్కొంది. ‘లాస్‌వెగాస్ దాడికి కారకుడు మా సైనికుడే. మా సూచన మేరకే పెడాక్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఐసిస్ జిహాదీలపై దాడులకు పాల్పడే దేశాలకు ఇదే గతి పడుతుంది. పెడాక్ కొద్ది నెలల క్రితమే ఇస్లాం స్వీకరించాడు’ అని ఐసిస్ సమాచార విభాగం అమాక్ ఆన్‌లైన్ ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ ఘటనలో ఉగ్రకోణమేదీ కనబడలేదని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పెడాక్‌కు ఎటువంటి సంబంధం లేదని తేలిందని స్పష్టం చేసింది. పెడాక్ అమెరికాకు చెందిన విమానయాన, భద్రత సంస్థ ‘లాక్‌హీడ్ మార్టిన్’లో 1985 నుంచి 1988 వరకు పనిచేశాడు.
అమెరికాలో రక్తచరిత్ర
నెవడాలోని లాస్ వెగాస్‌లోకాల్పులు (2017)
ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్ (2016)
వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ 2007)
కనెక్టికట్‌లోని శాండీహుక్ స్కూల్ (2012)
టెక్సాస్‌లోని లూబీ రెస్టారెంట్‌లో (1991)
కాలిఫోర్నియాలోని మెక్‌డొనాల్డ్‌లో (1984)
శాన్ బెర్నార్డినో దాడి (2015)
ఎడ్మండ్ పోస్టాఫీస్‌లో కాల్పులు (1986)
ఫోర్డ్‌వుడ్‌లో కాల్పులు (2009)
బిగ్‌హాంప్టన్‌లో కాల్పులు (2009)
కొలరాడోలోని అరోరాలో (2012)
ప్రాణాలతో బయటపడ్డాం..
సాక్షి, అమరావతి: అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల ప్రాంతంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. భీమవరంకు చెందిన కర్రి ప్రేమ్ కుమార్(జర్నలిస్టు), మల్లినీడి తిరుమలరావు (బాబి, రియల్టర్), నారాయణ (వ్యాపారి), మరో ఇద్దరు సెప్టెంబర్ 15న అమెరికా పర్యటనకు వెళ్లారు. వేర్వేరు నగరాల్లో పర్యటించి చివరిగా లాస్‌వెగాస్‌కు వచ్చారు. అక్కడ కాల్పులు చోటుచేసుకోవడంతో పోలీసుల సహకారంతో ప్రాణాలతో బయటపడి హోటల్‌లో తలదాచుకున్నారు.
అసలేం జరుగుతోందో అర్థంకాలేదు:ప్రేమ్‌కుమార్
‘శుక్రవారం లాస్‌వెగాస్‌కు వచ్చాం. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కాసినో గేమ్ బోర్డుల వద్ద చూస్తున్నాం. అదే సమయంలో మా హోటల్ పక్కనున్న మరో హోటల్‌లో సంగీత కచేరి జరుగుతోంది. కచేరీకి దాదాపు 25 వేల మంది ప్రేక్షకులొచ్చారు. ఒక్కసారిగా కాల్పుల మోత విన్పించడంతో ప్రేక్షకులంతా చెల్లాచెదురుగా పరుగెత్తారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. భయంతో ఒకరినొకరు తొక్కుకుంటూ పరుగెత్తారు. అందరూ సేఫ్‌జోన్‌కు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సంకేతాలిచ్చారు. హోటల్లో ఓదుండగుడు కాల్పులు జరుపుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. చాలా మంది హోటళ్లలో సేఫ్‌జోన్‌లో ఉన్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాం’.