U.S
-
‘వాన్నా క్రై’ ఉ.కొరియా పనే: అమెరికా
వాషింగ్టన్: ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల కంప్యూటర్లపై జరిగిన వాన్నాక్రై రాన్సమ్వేర్ దాడి వెనక ఉత్తర కొరియా పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది. యూఎస్ హోంల్యాండ్ భద్రతా సలహాదారు టామ్ బోసెర్ట్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో సోమవారం ఈ విషయం వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో బహిర్గతంచేసే అవకాశాలున్నాయి. ‘వాన్నాక్రై దాడులు విస్తృతంగా వ్యాపించాయి. దొంగిలించిన సమాచారాన్ని తిరిగివ్వడానికి బిలియన్ల కొద్ది డాలర్లను డిమాండ్ చేశారు. ఇందులో ఉ.కొరియాకు ప్రత్యక్ష పాత్ర ఉంది. మేము ఈ ఆరోపణలు గుడ్డిగా చేయడంలేదు. పక్కా ఆధారాలున్నాయి’ అని టామ్ అన్నారు. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరిచేలా సైబర్ ముప్పును తగ్గించడం కోసం అమెరికా చొరవతీసుకుని ప్రపంచ దేశాలతో కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. దశాబ్ద కాలంగా ఉ.కొరియా హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. -
అమెరికా చరిత్రలోనే ఘోర మారణకాండ
-
అమెరికా చరిత్రలోనే ఘోరమారణకాండ
కేసినోలకు, నైట్ క్లబ్‌లకు ఫేమస్ అయిన లాస్‌వెగాస్‌లో నరమేధం సృష్టించాడో రాక్షసుడు. విశాల ప్రాంగణంలో జేసన్ ఆల్డీన్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్న భారీ జనసముదాయంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఉన్న ఒక హోటల్లోని 32వ అంతస్తులోని తన గదిలోని కిటికీ నుంచి తాపీగా కిందనున్న అమాయక ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎక్కడినుంచి దూసుకొస్తున్నాయో తెలియని బుల్లెట్లు శరీరాల్ని ఛిద్రం చేస్తోంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి ప్రజలు సురక్షిత ప్రదేశం కోసం పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో 5 వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ మారణకాండకు పాల్పడిన, స్థానికుడైన స్టీఫెన్ పెడాక్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణాన్ని ఎఫ్‌బీఐ తోసిపుచ్చగా.. ఈ కాల్పులకు పాల్పడింది తమ సైనికుడేనని ఐసిస్ ప్రకటించింది. లాస్‌వెగాస్: అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. పైనుంచి కాల్పులు జరగటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటుపోవాలో తెలియక బాధితులు తోచిన వైపు పరుగులు తీశారు. ఉన్మాది మారణకాండతో సంగీతవిభావరి ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. ఈ ఘటనలో 500 మందికి పైగా గాయాలయ్యా యి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కారకుడైన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ (64) అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని, కొద్ది నెలల క్రితమే పెడాక్ ఇస్లాం మతం స్వీకరించాడని ఐసిస్ పేర్కొంది. అయితే ఇది ఉన్మాద చర్యేనని.. ఉగ్ర ఘటనగా భావించట్లేదని ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, లాస్‌వెగాస్ బాధితుల్లో భారతీయులెవరూ లేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అసలేం జరిగింది? ‘రూట్ 91’ పేరుతో లాస్‌వెగాస్‌లోని మాండలే బేలో మూడ్రోజుల మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 30వేల మంది సంగీతాభిమానులు చుట్టు పక్కల రాష్ట్రాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కచేరీ ఉత్సాహంగా సాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో కన్సర్ట్‌లో అందరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. దీంతో కన్సర్ట్‌లో కలకలం రేగింది. ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియని గుళ్ల వర్షం నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎత్తైన భవనం పైనుంచి పక్కా వ్యూహంతో జరిపిన ఈ కాల్పులు సంగీతాభిమానుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఎటువెళ్లాలో అర్థం కాక ఆర్తనాదాలతో తలోదిక్కుకు పారిపోయే ప్రయత్నంలో మరింత గందరగోళం నెలకొంది. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు, వైద్యులు పేర్కొన్నారు. 32వ అంతస్తు నుంచి కన్సర్ట్ వేదిక పక్కనే మాండలే బే కాంప్లెక్స్ ఉంది. ఈ భవనం 32వ అంతస్తులోని హోటల్ గదిలో స్టీఫెన్ పెడాక్ మకాం వేశాడు. ఈ ఘటన కోసం వ్యూహాత్మకంగానే ఎత్తైన భవంతిని పెడాక్ ఎంచుకున్నాడు. ఈయన ఉన్న గది నుంచి కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతం 1700 అడుగుల దూరం (ఏటవాలుగా 518 మీటర్లు) ఉంది. పైనుంచి బుల్లెట్లు దూసుకొస్తుండటంతో కచేరీలో ఉన్న వారికి కూడా ఎటుపోవాలో తోచలేదు. దీని కారణంగానే మృతులు, బాధితుల సంఖ్య పెరిగింది. కాల్పులు పక్కనున్న హోటల్ భవంతి నుంచి వస్తున్నాయని గుర్తించిన పోలీసులు 32వ అంతస్తులోని ఆ గదిలోకి చేరుకునేసరికే.. పెడాక్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఆ గది నుంచి 10 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఘటన జరిగిన సమయంలో అతనితోపాటు ఓ మహిళ ఉందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనతో ఆ మహిళకు సంబంధం లేదని నిర్ధారించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా ఈ కన్సర్ట్ కాల్పులను పేర్కొన్నారు. ‘ఈ దారుణ ఘటనలో 58 మంది మరణించారు. 200 మంది వరకు గాయపడి ఉంటారని మొదట భావించాం. కానీ 515 మందిని ఆసుపత్రులకు తీసుకెళ్లాం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి లోంబార్డో తెలిపారు. లాస్ వెగాస్‌కు 130కిలోమీటర్ల దూరంలోని మెస్క్విట్ పట్టణంలోని పెడాక్ ఇంటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఇంటినుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గాజు పగిలిందనుకున్నాం! ‘కచేరీలో మునిగిపోయి ఉండగా.. ఒక్కసారి గాజు పగిలిన శబ్దం వచ్చింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే బుల్లెట్లు దూసుకొచ్చాయి. కాసేపటికి కాల్పులు ఆగిపోయాయనుకున్న సమయంలో మళ్లీ బుల్లెట్ల వర్షం మొదలైంది’ అని మోనిక్ డెకెర్ఫ్ అనే బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అమెరికా విఖ్యాత గాయకుడు జేసన్ అల్డీన్ వేదికపై ఉన్నారు. ‘15–20 మంది నా కళ్లముందే చనిపోవటం చూశాన’ంటూ మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చాలా మంది.. ‘కాల్పుల శబ్దం కన్సర్ట్ సౌండ్ ఎఫెక్ట్ లో భాగమనే అనుకున్నాం. క్షణాల్లోనే కన్సర్ట్ మ్యూజిక్ కాదు.. నిజంగానే కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ కన్సర్ట్ ఓ యుద్ధభూమిని తలపించింది. అత్యవసర సిబ్బంది చేతికందిన టేబుళ్లు, మెటల్ రెయిలింగ్‌లను స్ట్రెచర్లుగా వినియోగించి.. బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ప్రముఖుల దిగ్భ్రాంతి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని భయంకరమైన దుర్ఘటనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బాధితులకు దేశమంతా అండగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లాస్‌వెగాస్ ఘటనకు సంతాపంగా వైట్హౌజ్తోపాటుగా ప్రభుత్వ కార్యాలయాలపై అమెరికా జాతీయ జెండాను అవనతం చేశారు. ‘మతిలేని ఈ దుశ్చర్య.. కలచివేసింది’ అని పోప్ ఫ్రాన్సిస్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఘోరమైన దాడిగా అభివర్ణించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. బాధితులకు సానుభూతి తెలిపారు. గతేడాది జూన్‌లో ఫ్లోరిడాలోని పల్స్ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల దుర్ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 2015 నవంబర్‌లో పారిస్‌లోని బాటక్లాన్లో జరిగిన ఓ కన్సర్ట్పై జరిగిన దాడిలో 90 మంది మృతిచెందారు. అది మా పనే: ఐసిస్ మ్యూజిక్ కన్సర్ట్పై కాల్పుల ఘటనకు తమదే బాధ్యతని ఐసిస్ పేర్కొంది. ‘లాస్‌వెగాస్ దాడికి కారకుడు మా సైనికుడే. మా సూచన మేరకే పెడాక్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఐసిస్ జిహాదీలపై దాడులకు పాల్పడే దేశాలకు ఇదే గతి పడుతుంది. పెడాక్ కొద్ది నెలల క్రితమే ఇస్లాం స్వీకరించాడు’ అని ఐసిస్ సమాచార విభాగం అమాక్ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ ఘటనలో ఉగ్రకోణమేదీ కనబడలేదని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పెడాక్‌కు ఎటువంటి సంబంధం లేదని తేలిందని స్పష్టం చేసింది. పెడాక్ అమెరికాకు చెందిన విమానయాన, భద్రత సంస్థ ‘లాక్‌హీడ్ మార్టిన్’లో 1985 నుంచి 1988 వరకు పనిచేశాడు. అమెరికాలో రక్తచరిత్ర నెవడాలోని లాస్ వెగాస్లోకాల్పులు (2017) ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్ (2016) వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ 2007) కనెక్టికట్‌లోని శాండీహుక్ స్కూల్ (2012) టెక్సాస్‌లోని లూబీ రెస్టారెంట్లో (1991) కాలిఫోర్నియాలోని మెక్‌డొనాల్డ్‌లో (1984) శాన్ బెర్నార్డినో దాడి (2015) ఎడ్మండ్ పోస్టాఫీస్‌లో కాల్పులు (1986) ఫోర్డ్వుడ్లో కాల్పులు (2009) బిగ్హాంప్టన్లో కాల్పులు (2009) కొలరాడోలోని అరోరాలో (2012) ప్రాణాలతో బయటపడ్డాం.. సాక్షి, అమరావతి: అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల ప్రాంతంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. భీమవరంకు చెందిన కర్రి ప్రేమ్ కుమార్(జర్నలిస్టు), మల్లినీడి తిరుమలరావు (బాబి, రియల్టర్), నారాయణ (వ్యాపారి), మరో ఇద్దరు సెప్టెంబర్ 15న అమెరికా పర్యటనకు వెళ్లారు. వేర్వేరు నగరాల్లో పర్యటించి చివరిగా లాస్‌వెగాస్‌కు వచ్చారు. అక్కడ కాల్పులు చోటుచేసుకోవడంతో పోలీసుల సహకారంతో ప్రాణాలతో బయటపడి హోటల్లో తలదాచుకున్నారు. అసలేం జరుగుతోందో అర్థంకాలేదు:ప్రేమ్‌కుమార్ ‘శుక్రవారం లాస్‌వెగాస్‌కు వచ్చాం. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కాసినో గేమ్ బోర్డుల వద్ద చూస్తున్నాం. అదే సమయంలో మా హోటల్ పక్కనున్న మరో హోటల్లో సంగీత కచేరి జరుగుతోంది. కచేరీకి దాదాపు 25 వేల మంది ప్రేక్షకులొచ్చారు. ఒక్కసారిగా కాల్పుల మోత విన్పించడంతో ప్రేక్షకులంతా చెల్లాచెదురుగా పరుగెత్తారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. భయంతో ఒకరినొకరు తొక్కుకుంటూ పరుగెత్తారు. అందరూ సేఫ్‌జోన్‌కు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సంకేతాలిచ్చారు. హోటల్లో ఓదుండగుడు కాల్పులు జరుపుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. చాలా మంది హోటళ్లలో సేఫ్జోన్లో ఉన్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాం’. -
యెమెన్‌లో కూలిన అమెరికా చాపర్
వాషింగ్టన్: అమెరికా సైన్యానికి చెందిన యూహెచ్ 60- బ్లాక్‌హాక్ హెలికాప్టర్ ఒకటి యెమెన్‌లో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు సైనికులు ఉన్నారని, వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఒకరు మాత్రం గల్లంతయ్యారని యూఎస్ ఆర్మీ ప్రకటించింది. యెమెన్ దక్షిణ తీరంలో ఆరుగురు సభ్యులతో కూడిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను శుక్రవారం సిబ్బంది శిక్షణలో వినియోగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం వెనుక ఉగ్రకోణం దాగున్నది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు. -
టాప్-5 నుంచి అమెరికా అవుట్
ప్రపంచాధినేతగా.. టాప్ దేశాల్లో తామే ముందంజలో ఉంటామంటూ ఊదరగొట్టే అమెరికాకు మరోసారి షాక్ తగిలింది. ఉత్తమ దేశాల జాబితా నుంచి మరో మూడు స్థానాలు కిందకు పడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాస్ వార్టన్ స్కూల్ , గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్స్ బీఏఈ కన్సల్టింగ్ భాగస్వామ్యంలో ''బెస్ట్ కంట్రీస్'' ర్యాంకింగ్స్ జాబితాను అమెరికా న్యూస్, వరల్డ్ రిపోర్టు మంగళవారం విడుదలచేసింది. ఈ రిపోర్టులో ఉత్తమ దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అమెరికా మరో మూడు స్థానాలు పడిపోయి ఏడవ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. స్విట్జర్లాండ్ తర్వాత రెండో స్థానంలో కెనడా, మూడు స్థానం బ్రిటన్ నిలిచాయి. అయితే మొత్తంగా ఆస్ట్రేలియా కంటే అమెరికా ముందజంలోనే ఉన్నప్పటికీ, జపాన్, స్వీడన్, జర్మనీల కంటే వెనుకంజలోకి పడిపోయింది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత గౌరవం కోల్పోయినట్టు 75 శాతం మంది రెస్పాడెంట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అమెరికాపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న 2016 ర్యాంకింగ్స్ నుంచి కూడా పడిపోయినట్టు వెల్లడించింది. వ్యాపారాలు, పౌరసత్వం, విద్య, పారదర్శకత, సాహస పర్యాటకంలో అమెరికా వెనుకంజలో పడినట్టు తెలిపింది. 90 శాతం అమెరికా వెలుపల సర్వేలో పాల్గొన్న వారు 2016 అమెరికా ఎన్నికలపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని భావించామని, కానీ అనూహ్యంగా ట్రంప్ గెలిచినట్టు చెప్పారు. 21వేల మంది బిజినెస్ లీడర్లు, సాధారణ ప్రజానీకం, పలు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ దేశాల్లో పలు అంశాలపై వారి వద్ద నుంచి ఈ సర్వే అభిప్రాయాలు సేకరించింది. -
ఉద్యోగవకాశాలకు భారీగా గండి!
ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపుపై ఓ వైపు భారీగా అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగావకాశాలు(జాబ్ ఓపెనింగ్స్) భారీగా పడిపోయినట్టు వెల్లడైంది. లేబర్ డిపార్ట్మెంట్ రిపోర్టు ప్రకారం ఆగస్టు నెలలో ఉద్యోగవకాశాలు ఎనిమిది నెలల కనిష్టానికి పతనమయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణ క్రమంలో లేబర్ మార్కెట్ పరిస్థితుల్లో కొంత మార్పులు చోటుచేసుకుంటున్నాయని రిపోర్టు తెలిపింది. లేబర్ డిపార్ట్మెంట్స్ నెలవారీ ఉద్యోగవకాశాలు, లేబర్ టర్నోవర్ సంయుక్తంగా ఈ రిపోర్టును విడుదలచేశాయి. ఈ రిపోర్టు ప్రకారం లేబర్ డిమాండ్ 3,88,000 తగ్గి, 5.4 మిలియన్లగా రికార్డు అయ్యాయి. డిసెంబర్ నుంచి ఇదే కనిష్ట స్థాయి. ఈ ఏడాది జూలై నెలలో ఉద్యోగవకాశాలు గణనీయంగా పెరిగి రికార్డు స్థాయిలో 5.83 మిలియన్లగా నమోదయ్యాయి. నెలవారీ క్షీణతను చూసుకుంటే 2015 ఆగస్టు తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. ఉద్యోగ నియామకాలు సైతం 5.26 మిలియన్ల నుంచి 5.21 మిలియన్లకు పడిపోయాయి. 2.98 మిలియన్ అమెరికన్లు తమ ఉద్యోగాల నుంచి వైదొలిగినట్టు వెల్లడైంది. ఉద్యోగాల కోత 1.64 మిలియన్ నుంచి 1.62 మిలియన్‌కు చేరాయి. స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకోవడం, ఉద్యోగ తొలగింపుల్లో క్షీణత వంటివి ఓ వైపు స్థిరమైన జాబ్స్ మార్కెట్ కొనసాగింపుతో పాటు మరోవైపు బెటర్ ఎంప్లాయిమెంట్ వెతుకులాట కోసం విశ్వాసం పెరుగుతుందని సంకేతాలను సూచిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ జాబ్ ఓపెనింగ్స్ డేటా ఎప్పడికప్పుడూ మారుతూ ఉంటుందని, కానీ జాబ్ ఓపెనింగ్స్ రేట్ ఇప్పటికీ గరిష్టంగానే(3.6 శాతంగానే) ఉన్నట్టు న్యూయార్క్‌లోని ఆర్డీక్యూ ఎకనామిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ జాన్ రైడింగ్ చెప్పారు. ఒకవేళ ఈ క్షీణత ఇలానే కొనసాగినా.. వ్యాపారులు మాత్రమే జాగ్రత్త వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫైనాన్స్, ప్రొఫెన్సియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ వంటి ఎక్కువ వేతన ఉద్యోగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతున్నట్టు చీఫ్ ఎకనామిస్ట్ జెడ్ కోల్కో తెలిపారు. ఉద్యోగనియమాకాల్లో కొంత మార్పులు సంభవించినా.. నియామకాల రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుందన్నారు. ఫెడ్ రేట్ల నిర్ణయంలో ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ యెల్లెన్ లేబర్ టర్నోవర్ రిపోర్టును కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు డిసెంబర్లో ఫెడ్ రేట్ల పెంపుపై సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ జాబ్ ఓపెనింగ్స్ డేటాను పరిగణలోకి తీసుకుని జానెట్ యెల్లెన్ ఫెడ్ రేట్లపై ఎలాంటి ప్రకటన వెలువరుచనున్నారో వేచిచూడాలి. -
అగ్రరాజ్యం అందులో వెనుకబడే ఉందట..!
స్వేచ్ఛా సమానత్వాల్లో అగ్రరాజ్యం వెనుకబడే ఉందట. స్త్రీలను ఉద్ధరిస్తున్నామని తెగ పోజులు కొట్టే దేశాల్లో ఒకటైన ఆమెరికా అంతర్జాతీయ ర్యాంకింగ్ ను బట్టి చూస్తే మహిళల పట్ల వివక్షను చూపడంలో ముందుందని లెక్కలు చెప్తున్నాయి. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో సమానత్వ చట్టాలు వచ్చి ఏళ్ళు గడిచినా...అవి ఎక్కువ కాలం నిలిచే అవకాశాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి చట్టాలను, సంస్కృతిని సైతం మార్కెట్ శక్తులే నిర్దేశిస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక ఫోరమ్ విడుదల చేసిన 145 దేశాల సమగ్ర అంతర్జాతీయ ర్యాంకింగ్ ప్రకారం వివక్షత ప్రదర్శించడంలోనూ ఆమెరికా అగ్రభాగానే నిలవడం ఒకింత ఆశ్చర్యాన్నే కలిగించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లెక్కలను బట్టి ప్రపంచంలోని 28 దేశాలతో పోలిస్తే అమెరికా లింగ వివక్ష విషయంలో చివరి స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. కేవలం క్యూబా కు తర్వాత, మొజాబిక్ కు ముందు అమెరికా చేరినట్లు తెలుసుకున్నారు. ప్రసిద్ధ జెనీవా ఆధారిత సంస్థ... దావోస్ లో జరిగిన తమ వార్షిక బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక, రాజకీయ సాధికారతల్లోనూ, విద్యాప్రాప్తి, ఆరోగ్య చర్యల విషయంలోనూ పదేళ్ళుగా మహిళలు, పురుషుల మధ్య కొనసాగుతున్న అంతరాలపై అందుబాటులో ఉన్న లెక్కలను సంస్థ పరిశీలించింది. మంత్రి వర్గ స్థాయిలో ఉద్యోగులుగా ఉన్న మహిళల సంఖ్య కూడ 32 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని, రాజకీయాల్లో పాల్గొనే మహిళల శాతం ఎక్కువగానే ఉన్నా... లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో విధానాలు సహకరించకపోవడం దురదుష్టకరంగా మారినట్లు ప్రస్తుత పరిశోధనలు తెలుపుతున్నాయి. మహిళలు, పురుషుల మధ్య వేతనాల్లో కూడ అత్యంత వ్యత్యాసం కనిపిస్తోందని లెక్కలు చెప్తున్నాయి. మహిళలకు ఆర్థిక అవకాశాలు అందించే కొన్ని దేశాల్లో ఆమెరికా కొంతవరకు ముందున్నట్లు కనిపిస్తున్నా... ర్యాంకింగ్ లో మాత్రం వ్యత్యాసం అధికంగానే ఉంది. అయితే మిగిలిన ఎన్నో దేశాలు పురుషులకంటే మహిళలకు..తక్కువ అవకాశాలు ఇవ్వడంతో పోలిస్తే ఆమెరికా ముందుందనే చెప్పాలి. అయితే అక్కడ మహిళలు అధిక శాతం శ్రామికులుగానే పనిచేయాల్సి వస్తోంది. పిల్లల సంరక్షణ, సెలవుల విషయంలో మాత్రం యూ.ఎస్ విధానాల్లో ప్రత్యేకత కనిపించడం లేదు. దీంతో చాలామంది మహిళలు వ్యాపార మార్గాలను ఎంచుకోవడమో.. లేదంటే ఇంట్లో కేర్ టేకర్లను పెట్టుకోవడమో చేస్తున్నారని వారి వ్యక్తిగత జీవితాలను పరిశీలించిన సంస్థ తెలిపింది. ప్రపంచంలోని ఏ దేశ నివేదిక పరిశీలించినా... పురుష, స్త్రీ సమానత్వంలో అంతరాన్ని పూరించడానికి కనీసం 118 ఏళ్ళు పట్టొచ్చని ప్రస్తుత నివేదిక అంచనా వేసింది. సమానత్వంలో ముందున్నామనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత రచయిత జాన్ గ్రే... మెన్ ఆర్ ఫ్రం మార్స్... ఉమెన్ ఆర్ ఫ్రం వీనస్ అనే పుస్తకాన్ని రాస్తే... 300 పేజీల ఆ పుస్తకం 5 కోట్ల కాపీలు పైగానే అమ్ముడుపోవడమే కాదు... ఇంకా అమ్ముడుపోతూనే ఉంది తప్పించి... ఇప్పటిదాకా ఆ రచయితని మహిళల పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన వారు మాత్రం కనిపించకపోవడం... అగ్రరాజ్యంలో మహిళలపై వివక్షతకు మరోరూపంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సమానత్వంపై బలమైన సంప్రదాయాన్ని కలిగి ఉన్న యూ.ఎస్., నార్డిక్ దేశాలు వివక్షతను చూపడంలో ముందున్నాయని ప్రస్తుత లెక్కలు చెప్పడం మాత్రం... కాస్త శోచనీయంగానే కనిపిస్తోంది.