ఉద్యోగవకాశాలకు భారీగా గండి!
ఉద్యోగవకాశాలకు భారీగా గండి!
Published Thu, Oct 13 2016 3:17 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM
ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపుపై ఓ వైపు భారీగా అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగావకాశాలు(జాబ్ ఓపెనింగ్స్) భారీగా పడిపోయినట్టు వెల్లడైంది. లేబర్ డిపార్ట్మెంట్ రిపోర్టు ప్రకారం ఆగస్టు నెలలో ఉద్యోగవకాశాలు ఎనిమిది నెలల కనిష్టానికి పతనమయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణ క్రమంలో లేబర్ మార్కెట్ పరిస్థితుల్లో కొంత మార్పులు చోటుచేసుకుంటున్నాయని రిపోర్టు తెలిపింది. లేబర్ డిపార్ట్మెంట్స్ నెలవారీ ఉద్యోగవకాశాలు, లేబర్ టర్నోవర్ సంయుక్తంగా ఈ రిపోర్టును విడుదలచేశాయి.
ఈ రిపోర్టు ప్రకారం లేబర్ డిమాండ్ 3,88,000 తగ్గి, 5.4 మిలియన్లగా రికార్డు అయ్యాయి. డిసెంబర్ నుంచి ఇదే కనిష్ట స్థాయి. ఈ ఏడాది జూలై నెలలో ఉద్యోగవకాశాలు గణనీయంగా పెరిగి రికార్డు స్థాయిలో 5.83 మిలియన్లగా నమోదయ్యాయి. నెలవారీ క్షీణతను చూసుకుంటే 2015 ఆగస్టు తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. ఉద్యోగ నియామకాలు సైతం 5.26 మిలియన్ల నుంచి 5.21 మిలియన్లకు పడిపోయాయి. 2.98 మిలియన్ అమెరికన్లు తమ ఉద్యోగాల నుంచి వైదొలిగినట్టు వెల్లడైంది. ఉద్యోగాల కోత 1.64 మిలియన్ నుంచి 1.62 మిలియన్కు చేరాయి.
స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకోవడం, ఉద్యోగ తొలగింపుల్లో క్షీణత వంటివి ఓ వైపు స్థిరమైన జాబ్స్ మార్కెట్ కొనసాగింపుతో పాటు మరోవైపు బెటర్ ఎంప్లాయిమెంట్ వెతుకులాట కోసం విశ్వాసం పెరుగుతుందని సంకేతాలను సూచిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ జాబ్ ఓపెనింగ్స్ డేటా ఎప్పడికప్పుడూ మారుతూ ఉంటుందని, కానీ జాబ్ ఓపెనింగ్స్ రేట్ ఇప్పటికీ గరిష్టంగానే(3.6 శాతంగానే) ఉన్నట్టు న్యూయార్క్లోని ఆర్డీక్యూ ఎకనామిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ జాన్ రైడింగ్ చెప్పారు. ఒకవేళ ఈ క్షీణత ఇలానే కొనసాగినా.. వ్యాపారులు మాత్రమే జాగ్రత్త వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఫైనాన్స్, ప్రొఫెన్సియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ వంటి ఎక్కువ వేతన ఉద్యోగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతున్నట్టు చీఫ్ ఎకనామిస్ట్ జెడ్ కోల్కో తెలిపారు. ఉద్యోగనియమాకాల్లో కొంత మార్పులు సంభవించినా.. నియామకాల రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుందన్నారు. ఫెడ్ రేట్ల నిర్ణయంలో ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ యెల్లెన్ లేబర్ టర్నోవర్ రిపోర్టును కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు డిసెంబర్లో ఫెడ్ రేట్ల పెంపుపై సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ జాబ్ ఓపెనింగ్స్ డేటాను పరిగణలోకి తీసుకుని జానెట్ యెల్లెన్ ఫెడ్ రేట్లపై ఎలాంటి ప్రకటన వెలువరుచనున్నారో వేచిచూడాలి.
Advertisement
Advertisement