
ఇస్లామాబాద్ : తన మూడో పెళ్లి విషయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మీడియాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆయన మూడో పెళ్లి చేసుకున్నారంటూ అటు పాక్ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంపై నిప్పులు చెరిగారు. ఈ దేశ(పాక్) రహస్యాలను తానేమన్నా భారత్‌కు అమ్మేశానా లేకుంటే.. ఈ దేశ (పాక్) సొమ్మునేమైనా దోచుకున్నానా. ఎందుకింతలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు' అంటూ మీడియాపై మండిపడ్డారు.
తన ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను వివాహం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు దుమ్ములేచేలా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ కుటుంబీకులు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఆ ప్రతిపాదన మాత్రం వచ్చిందని, ఇమ్రాన్ దానికి ఇంకా అంగీకారం తెలపలేదని, కుటుంబ సభ్యులతో, పిల్లలతో చర్చిస్తున్నారని కూడా తెలిపారు. అయినప్పటికీ ఆయన పెళ్లి విషయంపై మీడియా పదేపదే ఆయనను వెంటాడుతుండటంతో ఇమ్రాన్ చిర్రెత్తిపోయారు. ఇదంతా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రైవేట్ మీడియా చేస్తున్న కుట్ర అని అన్నారు. గత కొన్నాళ్లుగా వారు ఇదే పనిపెట్టుకున్నారని దుయ్యబట్టారు. అయినా తానేం భయపడబోనని చెప్పారు. 'షరీఫ్ నాకు 40 ఏళ్లుగా తెలుసు. వారి నీచమైన జీవితాలేమిటో కూడా నాకు బాగా తెలుసు. కానీ, అలాంటివేవి కూడా వారిలాగా నేను దిగజారి ఆరోపించను.. ప్రచారం చేయను' అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment