
హెచ్1బీ వీసాలపై ట్రంప్ ఉక్కుపాదం!
వాషింగ్టన్: ఎన్నికల హామీలను కచ్చితంగా అమలుచేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. గతేడాది చెప్పినట్లుగానే అమెరికా పౌరులకే అధిక టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. హెచ్1బీ వీసా దుర్వినియోగం, ఇందులో అవకతవకలపై దృష్టి సారించినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ భద్రతా అధికారులు సోమవారం ప్రకటించారు. ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు వలసవెళ్లే సాఫ్ట్ వేర్(ఐటీ సంబంధిత ప్రోగ్రామర్స్, డెవలపర్స్, ఇతర టెక్నికల్ ఉద్యోగులు) రంగానికి చెందిన విదేశీ ఉద్యోగులకు ఇక నుంచి సమస్యలు తప్పేలా కనిపించడం లేదు. భారతీయ ఐటీ రంగానికి ఇది పెద్ద సవాల్ గా మారనుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు.
అమెరికన్ కంపెనీలు స్థానిక కంపెనీలకే ప్రాజెక్టులు ఇవ్వడం మొదలుపెడితే, భారత ఐటీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దాంతో పాటు అక్కడికి వెళ్లే సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో భారతీయుల అధికంగా ఉండటం వారిని కలవరపెడుతుంది. ప్రతి ఏడాది 65000 మంది లాటరీ సిస్టమ్ తో హెచ్1బీ వీసా అందుకుని సాఫ్ట్ వేర్ జాబ్స్ పేరిట అమెరికాకు వస్తున్నారని, వీరి రాకకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు. అయితే 2018 ఏడాదికిగానూ లాటరీ సిస్టమ్ ను సోమవారం ఎలాంటి మార్పులు లేకుండా ప్రారంభించారు. గతంలో తరహాలా ఎక్కువ వీసాలు ఇవ్వరాదని, ఎలాంటి అక్రమాలు-అవకతవకలు జరగకూడదని పూర్తిస్థాయిలో పారదర్శకత ఉండాలని అధికారులను ట్రంప్ హెచ్చరించారు.
అత్యుత్తమ నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు మాత్రమే ఇక్కడ అవకాశాలు కల్పించాలని, తద్వారా వారి జీతాలు రెట్టింపు కంటే అధికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో అధిక ఖర్చులకు వెనక్కి తగ‍్గడంతో పాటు అమెరికన్లకే ఉద్యోగాలు వచ్చేలా చేయాలన్నది ట్రంప్ వ్యూహం. చాలా తక్కువ సంఖ్యలో హెచ్1బీ వీసాలు ఇవ్వాలని, పారదర్శకత పాటించాలని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ అధికార ప్రతినిధి పీటర్ రొబ్బియో తెలిపారు. అమెరికా ఉద్యోగుల కంటే విదేశీ ఉద్యోగులే సాఫ్ట్ వేర్ రంగంలో ఇక్కడ పనిచేస్తున్నారని, ట్రంప్ ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.