భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(ఫైల్ ఫొటో)
వాషింగ్టన్: హార్లీ–డేవిడ్‌సన్ బైక్‌లపై దిగుమతి సుంకం విషయంలో భారత్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా దిగుమతి చేసుకుంటున్న వేల కొద్ది భారత మోటర్ సైకిళ్లపైనా దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. స్టీల్ పరిశ్రమపై కాంగ్రెస్ సభ్యుల బృందంతో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో హార్లీ డేవిడ్‌సన్ బైకులపై దిగుమతి సుంకాన్ని భారత్ 75 నుంచి 50 శాతానికి తగ్గించింది. అయితే ఇది ఏమాత్రం సరిపోదని.. భారత్ నుంచి వస్తున్న మోటర్ సైకిళ్లపై అమెరికా పన్ను వసూలు చేయటం లేదన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఇదే విధానాన్ని భారత్ కొనసాగించాలన్నారు. ‘చాలా దేశాల్లో మన వస్తువులు తయారవుతున్నాయి. అందుకోసం వారికి భారీగానే చెల్లింపులు చేస్తున్నాం. అలాంటిది.. మన దగ్గర తయారైన హార్లీ డేవిడ్‌సన్ మోటర్ సైకిల్ వారి వద్దకెళ్లినా భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
‘రెసిప్రోకల్ ట్యాక్స్’... మోదీపై సెటైర్
ఇటీవల మోదీతో జరిగిన సంభాషణను పరోక్షంగా గుర్తుచేస్తూ.. ‘ఇండియా నుంచి ఓ గ్రేట్ జెంటిల్‌మన్ ఫోన్ చేసి మోటర్ సైకిళ్లపై గతంలో ఉన్న 100 శాతం పన్నును మొదట 75 శాతానికి ప్రస్తుతం 50 శాతానికి తగ్గించామని చెప్పారు’ అని తెలిపారు. భారత్ నుంచి వస్తున్న మోటర్ సైకిళ్లపై తాము ఏమాత్రం పన్ను వసూలు చేయటం లేదని చెబుతూ.. అమెరికాతో ‘రెసిప్రోకల్ ట్యాక్స్’ (పరస్పర సమానమైన పన్ను) విధానాన్ని అమలుచేయని దేశాలతో కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘ఇలాంటి కేసుల్లో మనం రెసిప్రోకల్ ట్యాక్స్‌ను అమలుచేయాల్సిందే. నేను భారత్‌ను తప్పుబట్టడం లేదు. ఆయా దేశాలు ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయనిపిస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. రెసిప్రోకల్ ట్యాక్స్‌ను అమలుచేయాలని ట్రంప్ మొదటినుంచీ వాదిస్తున్నారు.
కాగా, తన వేతనంలోని నాలుగో వంతును (2017లో తీసుకున్న వేతనంలో) రవాణాశాఖ మౌలికవసతులను మెరుగుపరుచుకునేందుకు విరాళంగా ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి లక్ష డాలర్ల చెక్కును అందజేశారు. ఏడాదికి ట్రంప్ వేతనం 4 లక్షల డాలర్లు (రూ.2.56కోట్లు).
ఆ పోర్న్‌స్టార్‌కు 1.3లక్షల డాలర్లు ఇచ్చా!
ట్రంప్‌తో శారీరక సంబంధం ఉన్నట్లు ప్రకటించిన పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్‌కు 1.3 లక్షల డాలర్ల (రూ. 83.5లక్షలు) చెల్లించినట్లు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది మైకెల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించారు. తన సొంత డబ్బును క్లిఫార్డ్‌కు ఇచ్చానని.. ఇంతవరకు ట్రంప్‌గానీ, ఆయన ప్రచార విభాగం గానీ.. ఈ డబ్బును తిరిగి ఇవ్వలేదన్నారు. పోర్న్‌స్టార్ దీనిపై మాట్లాడకుండా ఉండేందుకు నవంబర్ 2016 ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment