‘ఆయన అద్భుతం.. మీడియానే ఫేక్’
వాషింగ్టన్: మీడియా అంటేనే దుమ్మెత్తిపోసే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి శివమెత్తారు. తమ దేశ జాతీయ భద్రత సలహాదారుడు, ట్రంప్‌కు అత్యంత అనుంగుడు మైఖెల్ ఫ్లిన్ రాజీనామా చేయడంపై మీడియా మొత్తం అబద్ధాలు వల్లేవేసిందని, అదొక బూటకపు మీడియా అని, అలాంటి వార్తలు లీకులివ్వడం చట్ట విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలసి మాట్లాడుతూ మీడియా ఫ్లిన్‌ను చాలా చెత్తగా ట్రీట్ చేసిందని పేర్కొన్నారు. ఆయన నిర్ణయానికి సానుకూలంగా ఒక్క మీడియా కూడా రాయలేదని మండిపడ్డారు.
రష్యాతో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనపై విశ్వాసం కోల్పోయారనే భావనలో రాజీనామా చేశారు తప్ప ఆయన తప్పు చేసి రాజీనామా చేయలేదని వెనుకేసుకొచ్చారు. ఫ్లిన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని చెప్పారు. మీడియానే అతడిని అన్‌ఫెయిర్‌గా వార్తలు వండివార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రాట్లు పెద్ద మొత్తంలో తన చేతుల్లో దెబ్బతిన్న తర్వాత ఆ విషయం ప్రజల్లో కవర్ చేసుకునేందుకు ఫ్లిన్ రాజీనామా విషయాన్ని పావుగా వాడుకుంటూ మీడియా సహాయంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఫ్లిన్ రాజీనామా తర్వాత ట్రంప్ తొలిసారి దానిపై స్పందించారు.