అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం | James Comey testifies on Donald Trump pressure, Russia probe | Sakshi
Sakshi News home page

అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం

Published Fri, Jun 9 2017 12:40 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం - Sakshi

అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం

సెనెట్‌ కమిటీ ముందు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ కోమీ సాక్ష్యం
► ఫ్లిన్‌పై విచారణ ఆపమనడంతో ఆందోళన చెందా.. ఆదేశంగా భావించా..
► దర్యాప్తు అడ్డుకోమని సూటిగా ట్రంప్‌ చెప్పలేదు..


వాషింగ్టన్‌: ఏకపక్షంగా, స్వలాభం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అతని మెడకు చుట్టుకుం టున్నాయి. చివరకు అధ్యక్ష పీఠానికే ఎసరు తెచ్చేలా చకాచకా పరిణామాలు మారిపోతు న్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తును ట్రంప్‌ పరోక్షంగా ప్రభావి తం చేశారని ఆరోపించిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ.. గురువారం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఆ మేరకు బహిరంగంగా సాక్ష్యమిచ్చారు.

ట్రంప్‌ ముఖ్య అనుచరుడైన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌పై విచారణ ఆపాలని ట్రంప్‌ కోరడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, ఆ సమయంలో ఆయన కోరికను ఆదేశంగా భావించానని కమిటీ సభ్యులకు కోమీ వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేసిందని సెనెట్‌ కమిటీకి స్పష్టం చేశారు. ట్రంప్‌ యంత్రాంగం తనను అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించడంతో పాటు ఎఫ్‌ఐబీపై అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. ఫ్లిన్‌పై విచారణ ఆపాలని కోరుతూ.. న్యాయప్రక్రియకు ట్రంప్‌ విఘాతం కలిగించారా? అన్న ప్రశ్నకు మాత్రం కోమీ సూటిగా సమాధానమివ్వలేదు. ట్రంప్‌ ఆదేశాన్ని తానలా భావించలేదని బదులిచ్చారు. కోమీ వాంగ్మూలం ఆయన మాటల్లోనే...

ట్రంప్‌ తప్పుడు ప్రచారం
ఎఫ్‌బీఐ అస్తవ్యస్తంగా తయారైందని, ఎఫ్‌బీఐ ప్రతినిధులు డైరెక్టర్‌ పట్ల నమ్మకాన్ని కోల్పోయారంటూ అమెరికా ప్రజలకు ట్రంప్‌ అబద్ధాలు చెప్పారు. చట్ట ప్రకారం ఎఫ్‌బీఐ డైరక్టర్‌ను తొలగించేందుకు ఎలాంటి కారణాలు అవసరం లేకపోయినా నన్ను తొలగించేందుకు చూపిన కారణాలు అతి సాధారణంగా ఉన్నాయి. నా గురించి అటార్నీ జనరల్స్‌ తో పాటు అనేక మందితో మాట్లాడానని, అద్భుతంగా పనిచేస్తున్నట్లు తేలిందని, ఎఫ్‌బీఐ బృందం కూడా నన్ను ఎంతో ఇష్టపడుతున్నట్లు ట్రంప్‌ నాకు చెప్పారు. అయితే మే 9న మాత్రం అందుకు వ్యతిరేకంగా నన్ను పదవి నుంచి తప్పించారు. నేను అద్భుతంగా పనిచేస్తున్నానని, నన్ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు ట్రంప్‌ పదేపదే చెప్పారు.

ఒక్కసారిగా అవాక్కయ్యా..
ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యాను. ఫ్లిన్‌పై విచారణను ఇంతటితో వదిలేయాలన్న విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నా.. ఫ్లిన్‌ను వదిలేయండి అని ట్రంప్‌ కోరార’ని కోమీ చెప్పారు. ఈ సందర్భంగా సెనెటర్‌ డియన్నె ఫెయిన్‌స్టెన్‌ జోక్యం చేసుకుంటూ ..‘ ఫ్లిన్‌పై విచారణను ఆపమనడం తప్పని ట్రంప్‌ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ‘ఆ సంభాషణతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా’నని కోమీ సమాధానమిచ్చారు.

నమ్మించి మోసగించారు..
ట్రంప్‌ ప్రమాణస్వీకారం అనంతరం జనవరి 27న ఆయనతో విందులో పాల్గొన్నాను. నాకు మద్దతుగా ఉన్నట్లు నమ్మించేందుకు అధ్యక్షుడు ప్రయత్నించారని నాకు అర్థమైంది. నాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ట్రంప్‌  చెప్పారు. నన్ను కొనసాగించే అంశంపై మూడుసార్లు మాట్లాడుకున్నాం. అయితే అందుకు ప్రతిఫలంగా ట్రంప్‌ ఏదో ఆశిస్తున్నారని అప్పుడు నాకనిపించింది. ట్రంప్‌ మూడు అంశాలు నా నుంచి ఆశించారు. ఒకటి విధేయత, రెండు ఫ్లిన్‌పై విచారణ ఆపడం, ట్రంప్‌పై ఎలాంటి విచారణ జరగడం లేదని బహిరంగంగా ప్రకటించడం.

ముందు జాగ్రత్తగానే మీటింగ్‌ నోట్స్‌..
ట్రంప్‌తో మొదటి సమావేశం నుంచి నా తొలగింపు వరకూ అధ్యక్షుడితో మీటింగ్‌ నోట్స్‌ తీసుకున్నాను. ట్రంప్‌తో చర్చించిన అంశాలపై ఆయన అబద్ధం ఆడవచ్చనే ఉద్దేశ్యంతో ముందే జాగ్రత్త పడ్డాను.  ట్రంప్‌తో వ్యక్తిగత సంభాషణాల్ని బయటపెడితే.. ట్రంప్‌ యంత్రాంగం చర్యల్ని విచారించేందుకు ప్రత్యేక కౌన్సిల్‌ నియమిస్తారని భావించి అలా చేశాను.    ట్రంప్‌పై ప్రత్యేకంగా మాత్రం ఎలాంటి విచారణ జరగలేదు.  అయితే ఈ కేసులో ట్రంప్‌ ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

వారి జోక్యం నిజం
2016 అధ్యక్ష ఎన్నికల్లో ఉద్దేశపూ ర్వకంగానే రష్యా జోక్యం చేసుకుందని సెనెట్‌ సభ్యులకు కోమీ స్పష్టం చేశారు. రష్యా జోక్యం అవాస్తవమని ట్రంప్‌ గతంలో చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యా జోక్యంపై లభించిన ఆధారాలు నిజమేనని కోమీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ ఆపమని ఏ సందర్భంలోనైనా ట్రంప్‌ కోరారా? అని సభ్యులు ప్రశ్నించగా.. లేదు అని కోమీ సమాధానమిచ్చారు. కేవలం ఫ్లిన్‌పై విచారణ ఆపమని మాత్రమే ట్రంప్‌ కోరినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement