అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రతిభ ఆధారిత నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అత్యున్నతస్థాయి నైపుణ్యమున్న విదేశీయులకు జారీచేస్తున్న వీసాలను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతామన్నారు. విదేశీయులకు అమెరికాలో జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసాలను తెస్తామన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం కారణంగా భారత ఐటీ నిపుణులు గణనీయంగా లబ్ధిపొందే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచదేశాలతో పోటీ..
కెనడా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఈ కొత్త వలసవిధానంలో పాయింట్లు కేటాయిస్తామని తెలిపారు. ‘ఈ విధానం కింద అభ్యర్థుల వయసు, నైపుణ్యం, ప్రతిభ, ఉద్యోగ అవకాశాలు, అమెరికా రాజ్యాంగం, ప్రభుత్వ పనితీరు, చరిత్రపై అవగాహన, ఇంగ్లిష్‌లో తప్పనిసరి ఉత్తీర్ణత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తాం. ప్రస్తుతం అమెరికా వలసవిధానం లోపభూయిష్టంగా ఉంది. దీనికారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ కళాశాలల్లో మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులకు కూడా ఓ డాక్టర్‌గా, పరిశోధకుడిగా, విద్యార్థిగా మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ కొత్తవిధానం ఓసారి ఆమోదం పొందితే నైపుణ్యవంతుల్ని ఆకర్షించే విషయంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది’ అని ట్రంప్ వెల్లడించారు.
మిశ్రమ స్పందన..
ట్రంప్ ప్రకటించిన నూతన వలస విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతినిధుల సభలో హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు మైక్ రోజర్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనివల్ల సరిహద్దు భద్రత పటిష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కొత్త విధానం వలసలకు వ్యతిరేకమనీ, ఇది కేవలం రాజకీయ జిమ్మిక్కు తప్ప మరేమీకాదని సెనెట్‌లో మైనారిటీ నేత చక్ స్చుమెర్ విమర్శించారు. నూతన విధానంలో దూరదృష్టి కొరవడిందని ఇండో–అమెరికన్, సెనెటర్ కమలా హ్యారిస్ పెదవివిరిచారు. ఆసియా సంతతి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వలస వెళతారని హ్యారిస్ గుర్తుచేశారు.
‘గ్రీన్‌కార్డు’ ఆశావహులకు ఊరట
కొత్త విధానంలో నైపుణ్యవంతులైన విదేశీ కార్మికులకు గ్రీన్‌కార్డుల్లో 57 శాతం కేటాయిస్తామని ట్రంప్ ప్రకటించడం కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు కోసం ఒక్కో భారతీయుడు పదేళ్ల పాటు వేచిచూడాల్సి వస్తోంది. కొత్తవిధానంలో వీరందరికీ త్వరితగతిన గ్రీన్‌కార్డులు మంజూరవుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొత్త వలసవిధానం కారణంగా లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్‌కార్డు లభిస్తుందని పేర్కొన్నారు. గ్రీన్‌కార్డుల కోటాను అవసరమైతే 57 శాతానికి మించి పెంచుతామనీ, అదే సమయంలో ఏటా జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల సంఖ్యను తగ్గించబోమని ట్రంప్ ప్రకటించడాన్ని వీరు స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment