వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విఫలమైందని ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు. కోవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ స్పందనపై నెల రోజులలోపు సరైన నివేదిక ఇవ్వకపోతే ఆ సంస్థకు ఇచ్చే నిధులను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించాడు. కరోనా మహమ్మారిపై అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విఫలమైందని ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. గత నెల డబ్ల్యూహెచ్‌ఓకి నిధుల్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ సోమవారం, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌కు ‘సెల్ఫ్ ఎక్స్‌ప్లెనెటరీ’ పేరుతో ఓ లేఖను రాశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్రంప్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.(స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!)
ఈ లేఖలో డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు అనుకూలంగా పని చేసిందని.. వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో అలసత్వం ప్రదర్శించిదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా అంశంలో డబ్ల్యూహెచ్‌ఓ చేసిన తప్పిదాలకు నేడు యావత్ ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటుందన్నాడు. డబ్ల్యూహెచ్‌ఓ ఇకనైనా చైనాకు మద్దతివ్వడం మానుకుని.. స్వతంత్రగా పని చేయాలన్నాడు. అంతేకాక నెల రోజుల లోపు డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై సరైన రీతిలో స్పందించకపోతే.. ఆ సంస్థకు ఇచ్చే నిధులను పూర్తిగా నిలిపివేయడమే కాక సంస్థలో తమ సభ్యత్వం గుర్చి పునరాలోచించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించాడు. ఇదిలా ఉండగా కోవిడ్-19 పుట్టుక, వ్యాప్తి.. వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ స్పందనపై స్వతంత్ర దర్యాప్తు ప్రారంభిచినట్లు ఆ సంస్థ ప్రకటించిది. సోమవారం జరిగిన వర్చువల్ అసెంబ్లీలో టెడ్రోస్ కరోనాపై అప్రమత్తం చేయడంలో లోపాలు జరిగినట్లు అంగీకరించడమే కాక దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నాడు.(వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో)
Comments
Please login to add a commentAdd a comment