టెక్ దిగ్గజాలతో అధ్యక్షుడి భేటీ
టెక్ దిగ్గజాలతో అధ్యక్షుడి భేటీ
Published Mon, Jun 19 2017 7:50 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఆపిల్ ఇంక్, అమెజాన్.కామ్ వంటి టెక్నాలజీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లతో ఆయన సోమవారం సమావేశం కానున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించి, సర్వీసులను మెరుగుపర్చేందుకు ప్రైవేట్ రంగం సాయం కోసం వైట్ హౌజ్ చూస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యయాలను తగ్గించి 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లను అంటే దాదాపు రూ.64,47,170కోట్లకు పైగా పొదుపుచేసేందుకు ఓ ఆర్థిక అవకాశం ఉన్నట్టు అడ్మినిస్ట్రేటివ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 20 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ లతో ఆయన చర్చలు చేపట్టనున్నారు. ఐటీని మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ ఏజెన్సీల అవినీతి రూపుమొద్దించడం వంటి వాటిని కూడా చేపట్టాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఇప్పటికే చాలామంది ఎగ్జిక్యూటివ్ లు ట్రంప్ రెగ్యులేటరీ విధానాలు, ఇతర కారణాలతో కొత్త అడ్మినిస్ట్రేషన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు. మే నెలలో ట్రంప్ అమెరికన్ టెక్నాలజీ కౌన్సిల్ ను కూడా ఏర్పాటుచేశారు. ట్రంప్ నిర్వహించబోయే ఈ భేటీలో పాల్గొనే వారిలో ఆల్ఫాబెట్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్, వెంచర్ క్యాపిటల్ సంస్థ క్లీనర్ పెర్కిన్స్ చైర్మన్ జాన్ దోర్ర్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్, క్వాల్ కామ్, ఒరాకిల్, అడోబ్ సిస్టమ్స్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు ఉన్నట్టు వైట్ హౌజ్ అధికారులు చెప్పారు. వచ్చే దశాబ్దం కల్లా ప్రభుత్వం ఖర్చులను 3.6 ట్రిలియన్ డాలర్ల(రూ.2,32,09,812కోట్లు) మేర తగ్గించాలని ట్రంప్ చట్టసభ్యులను ఆదేశించారు. బడ్జెట్ లో పేదవారికి ఆహారం అందించే ప్రొగ్రామ్స్, హెల్త్ కేర్ వంటి వాటిపై ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాక రక్షణ రంగంలో కూడా వ్యయాలను పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఐటీపై వార్షికంగా 80 బిలియన్ డాలర్లకు పైననే అమెరికా ప్రభుత్వం వెచ్చిస్తుందని 2016 యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీసు రిపోర్టు అంచనావేసింది. దీనిలో క్లాసిఫైడ్ ఆపరేషన్లను కలుపలేదు. అదేవిధంగా ఈ భేటీలోనే ఏప్రిల్ లో అమెరికా తీసుకొచ్చిన వీసా ప్రొగ్రామ్ ను కూడా సమీక్షించనున్నారని తెలిసింది. అమెరికన్లకే పెద్దపీట వేసేలా వీసా ప్రొగ్రామ్ నిబంధనలను ట్రంప్ కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి ఆరా తీయనున్నారు.
Advertisement