కారు మీదకు దూసుకొచ్చినా..
ఓ ఎర్రకారు మాంచెస్టర్ వీధులలో బీభత్సం సృష్టించింది. మారియన్ స్మిత్(79) అనే వృద్ధుడు తప్పతాగి డ్రైవింగ్ చేశాడు. ఓ బాలుడి పైనుంచి కారు దూసుకెళ్లినా బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రేటర్ మాంచెస్టర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాలుడు లేచిన వెంటనే తనకు నచ్చిన స్వీట్లను తీసుకుని తింటూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి..
భార్యాభర్తలు, వారి ఆరు సంవత్సరాల బాబు ఓ మార్కెట్ స్టోర్ కి వెళ్లారు. పేరేంట్స్ ఇంటికి కావలసిన వస్తువులు ఖరీదు చేస్తుండగా, బాబు మాత్రం తనకు ఇష్టమైన స్వీట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే అప్పటికే తప్పతాగిన మారియన్ స్మిత్ తన కారును ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక అంతే తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చిన స్టోర్ లోకి దూసుకొచ్చిన ఎరుపు రంగు కారు బాలుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన చూస్తున్న బాలుడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమ కుమారుడికి ఏమైందోనని కంగారు పడి పరుగున వచ్చి, బాలుడ్ని పైకి లేపారు. అదృష్టవశాత్తూ బాబు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.
కారు కింద పడి మృత్యువు నుంచి తప్పించుకున్న బాలుడు.. స్టోర్లో ఉన్న వారికి తాను కూడా షాక్ ఇచ్చాడు. ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత కూడా వెంటనే తనకు ఇష్టమైన స్వీట్లు తీసుకుని తింటూ అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో స్టోర్ కాస్త ధ్వంసమైంది. బాలుడు నిజంగానే అదృష్టవంతుడని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసు జాన్ బ్రెన్నన్ చెప్పాడు. తప్పతాగి డ్రైవింగ్ చేసిన స్మిత్ కు మూడేళ్లపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారని తెలిపాడు.