Alex Baty: బ్రిటన్‌లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్‌లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది!
ఇలా దొరికాడు...
వాయవ్య ఫ్రాన్స్‌లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్‌మెంట్‌పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు.
తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్‌కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్‌ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి.
ఏం జరిగిందంటే...
అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్‌ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది.
తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్‌లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్‌ను తీసుకుని 2021లో ఫ్రాన్స్‌లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు.
అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు.
– సాక్షి, నేషనల్ డెస్క్