మృతదేహం తరలించేందుకు రూ. 14 లక్షల విరాళం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో ప్రమాదవశాత్తూ మరణించిన భారతీయ విద్యార్థి భూబేష్ పళని మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భూబేష్ మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి అయ్యే ఖర్చులు భరించే స్తోమత అతని కుటుంబానికి లేకపోవడంతో సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. చాలామంది దాతలు స్పందించి విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాదాపు 14 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
గత నెల 30న వెల్లింగ్టన్ సముద్ర తీరంలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న భూబేష్ను సమీపంలోని హట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెల్లింగ్టన్ ఆస్పత్రికి మార్చారు. భూబేష్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. భూబేష్ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చును భరించే స్థితిలో అతని కుటుంబం లేకపోవడంతో న్యూజిలాండ్లో నివసిస్తున్న భారతీయలు భూబేష్ మృతదేహాన్ని తరలించేందుకు సాయం చేశారు. వీలైనంత త్వరలో భారత్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.