అమాయకులపై నరమేధాన్ని సహించం
ఇరాక్‌లో అమెరికా వైమానిక దాడులకు ఒబామా సమర్థన
తమ దౌత్యవేత్తలను, మైనారిటీలను రక్షిస్తామని స్పష్టీకరణ
వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం చేసుకోజాలదని, అయితే, అమాయకులు నరమేధానికి గురయ్యే ఇరాక్‌లాంటి పరిస్థితిని మాత్రం అమెరికా చూస్తూ వదిలేయబోదని స్పష్టంచేశారు. మిలిటెంట్లను తుదముట్టించేందుకు దీర్ఘకాలంపాటు దాడులను కొనసాగిస్తామని ఒబామా ప్రకటించారు. ‘‘కేవలం కొద్ది వారాల్లో ఈ సమస్యను మనం పరిష్కరించలేం. కుర్దిస్థాన్‌లోని స్థావరాలపై ఈ వారంలో మొదలైన మా దాడులు నెలలపాటు కొనసాగుతాయి’’ అని ఒబామా అన్నారు.
అమెరికా సైన్యంతోకాకుండా ఇరాక్‌లో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మిలిటెంట్ల ఆగడాలను సమర్ధంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. సంజాన్ పర్వతంపై తలదాచుకున్న మైనారిటీలను మిలిటెంట్ల దాడుల నుంచి తప్పక రక్షిస్తామన్నారు. వీరి రక్షణ కోసం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌లు తమ వంతు సాయం చేస్తామని అంగీకరించారని ఒబామా తెలిపారు. ఇరాక్‌లోని తమ దౌత్యవేత్తలు, సైనిక సలహాదారులు, మతపరమైన మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్టు ఒబామా తెలిపారు. మైనారిటీలకు తాము మానవతాపరమైన సాయం కొనసాగిస్తామన్నారు. ఇరాక్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించిన మిలిటెంట్లు మైనారిటీలపట్ల కిరాతకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మైనారిటీ వర్గాల్లోని పురుషులను హతమారుస్తూ, వారి కుటుంబసభ్యులను నిర్బంధిస్తూ,, మహిళలను బానిసలుగా చేస్తూ మిలిటెంట్లు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఒబామా ఆరోపించారు. మిలిటెంట్లు లక్ష్యంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో సైనిక దాడులు జరుపుతామన్నారు.
మిలిటెంట్ల ఆగడాలకు భీతిల్లిన వేలాదిమంది యాజిదీ మైనారిటీలు ఉత్తర ఇరాక్‌లోని సింజాన్ పర్వతంపై తలదాచుకుంటూ తిండినీరులేక ఇబ్బం దులు పడుతున్నదశలో మిలిటెంట్లపై వైమానిక దాడులకు ఒబామా గురువారం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కాగా, అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో మిలిటెంట్ల స్థావరాలపై దాడులకు ఇరాక్ ఫెడరల్ బలగాలు, కుర్దు సైనికులు కూడా సిద్ధమయ్యారు.