raq
-
అమాయకులపై నరమేధాన్ని సహించం
ఇరాక్‌లో అమెరికా వైమానిక దాడులకు ఒబామా సమర్థన తమ దౌత్యవేత్తలను, మైనారిటీలను రక్షిస్తామని స్పష్టీకరణ వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం చేసుకోజాలదని, అయితే, అమాయకులు నరమేధానికి గురయ్యే ఇరాక్లాంటి పరిస్థితిని మాత్రం అమెరికా చూస్తూ వదిలేయబోదని స్పష్టంచేశారు. మిలిటెంట్లను తుదముట్టించేందుకు దీర్ఘకాలంపాటు దాడులను కొనసాగిస్తామని ఒబామా ప్రకటించారు. ‘‘కేవలం కొద్ది వారాల్లో ఈ సమస్యను మనం పరిష్కరించలేం. కుర్దిస్థాన్‌లోని స్థావరాలపై ఈ వారంలో మొదలైన మా దాడులు నెలలపాటు కొనసాగుతాయి’’ అని ఒబామా అన్నారు. అమెరికా సైన్యంతోకాకుండా ఇరాక్‌లో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మిలిటెంట్ల ఆగడాలను సమర్ధంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. సంజాన్ పర్వతంపై తలదాచుకున్న మైనారిటీలను మిలిటెంట్ల దాడుల నుంచి తప్పక రక్షిస్తామన్నారు. వీరి రక్షణ కోసం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌లు తమ వంతు సాయం చేస్తామని అంగీకరించారని ఒబామా తెలిపారు. ఇరాక్‌లోని తమ దౌత్యవేత్తలు, సైనిక సలహాదారులు, మతపరమైన మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్టు ఒబామా తెలిపారు. మైనారిటీలకు తాము మానవతాపరమైన సాయం కొనసాగిస్తామన్నారు. ఇరాక్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించిన మిలిటెంట్లు మైనారిటీలపట్ల కిరాతకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మైనారిటీ వర్గాల్లోని పురుషులను హతమారుస్తూ, వారి కుటుంబసభ్యులను నిర్బంధిస్తూ,, మహిళలను బానిసలుగా చేస్తూ మిలిటెంట్లు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఒబామా ఆరోపించారు. మిలిటెంట్లు లక్ష్యంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో సైనిక దాడులు జరుపుతామన్నారు. మిలిటెంట్ల ఆగడాలకు భీతిల్లిన వేలాదిమంది యాజిదీ మైనారిటీలు ఉత్తర ఇరాక్‌లోని సింజాన్ పర్వతంపై తలదాచుకుంటూ తిండినీరులేక ఇబ్బం దులు పడుతున్నదశలో మిలిటెంట్లపై వైమానిక దాడులకు ఒబామా గురువారం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కాగా, అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో మిలిటెంట్ల స్థావరాలపై దాడులకు ఇరాక్ ఫెడరల్ బలగాలు, కుర్దు సైనికులు కూడా సిద్ధమయ్యారు. -
ఇరాక్‌లో అమెరికా దాడులు
మిలిటెంట్లపై విరుచుకుపడిన అగ్రరాజ్యం వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు అమెరికా బలగాలు శుక్రవారం వైమానిక దాడులు ప్రారంభించాయి. ఉత్తర ఇరాక్‌లో ఐఎస్ మిలిటెంట్లకు చెందిన ఓ శతఘ్నిదళంపై అమెరికా ఫైటర్ జెట్లు రెండు లేజర్ గెడైడ్ బాంబులు జారవిడిచాయి. అవసరమైతే ఐఎస్ మిలిటెంట్లపై గగనతల దాడులు మొదలుపెడతామని ఒబామా గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాయవ్య ఇరాక్‌లోని సింజర్ కొండప్రాంతంలో చిక్కుకున్న మైనారిటీ ప్రజలను కూడా రక్షించాల్సిందిగా ఒబామా తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇరాక్‌లోని యాజిదీ మైనారిటీ ప్రజలను ఇస్లామిక్ మిలిటెంట్లు ఊచకోత కోస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ఆహారం, నీరు లేకుండా కొండపై చిక్కుకున్న వేలాది మంది మైనారిటీ పౌరులను ఆదుకోవాలని ఆయన తమ దళాలను ఆదేశించారు. ఇరాక్‌లోని కుర్దుప్రాంతంలో ఉన్న ఎర్బిల్‌వైపు మిలిటెంట్లు ఒక్క అడుగు ముందుకు వేసినా వారిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పట్టణంలోని కాన్సులేట్‌లో పలువురు అమెరికా దౌత్య అధికారులు, పౌరులు పనిచేస్తున్నారు. ఇక్కడేకాదు, ఇరాక్‌లో ఎక్కడైనా ఇస్లామిక్ మిలిటెంట్లు అమెరికన్లవైపు కన్నెత్తి చూసినా ఊరుకోబోమన్నారు. ఒబామా ఆదేశాల నేపథ్యంలో సున్నీ మిలిటెంట్లపై వైమానిక దాడులను ప్రారంభించామని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం పెంటగన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఇరాక్‌లోని వాయవ్య ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని పోరు సాగిస్తున్న మిలిటెంట్లు శుక్రవారం అన్బర్ ప్రావిన్స్‌లో ఓ విద్యుత్ కేంద్రంపై దాడిచేయగా పోలీసులు, ఆర్మీ, స్థానిక గిరిజనులు కలిసి తిప్పికొట్టారు. ఈ సంఘటనలో 25 మంది జిహాదిస్టులు హతమయ్యారు. ఇరాక్ ప్రభుత్వానికి అండగా నిలవండి.. ఇరాక్ సంక్షోభ నివారణకు అక్కడి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరింది. మిలిటెంట్లపై వైమానిక దాడులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్న వార్తలను ఇరాక్ ఖండించింది. అమెరికా దాడులను ఇరాకీలు, కుర్దిష్‌లు ఆహ్వానించారు. ఇరాక్‌లో జిహాదిస్టుల దాడులు ఎదుర్కొంటున్న క్రైస్తవులు, ఇతరులకు సంఘీభావం కోసం తాను ప్రత్యేక దూతను పంపనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. -
ఇరాక్ యాత్రికులు క్షేమం
సాక్షి, సిటీబ్యూరో: ఇరాక్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు నగరానికి ఆదివారం క్షేమంగా చేరుకున్నారు. ఏటా షియా ముస్లింలు నాల్గుసార్లు ఇరాక్‌లోని పుణ్యక్షేత్రమైనా కర్బాలా, నజఫ్ ప్రాంతాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ (పాతబస్తీ, దారుషిఫా, నూర్‌ఖాన్‌బజార్) నుంచి 350 యాత్రికులు 12 బృందాల్లో పుణ్యక్షేత్రాలకు బయల్దేరి వెళ్లారు. షబేబరాత్ రాత్రి కర్బాలా మైదానంలో జరిగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తమ పూర్వీకుల త్యాగాలను స్మరించుకున్నారు. వీరిలో 290 మంది కొన్ని రోజుల క్రితమే నగరానికి చేరుకోగా.. మిగిలిన 60 మంది ఆదివారం క్షేమంగా వచ్చారు. ప్రార్థనలు ఫలించాయి.. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడికి వెళ్లిన తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు అక్కడి జరుగుతున్న పరిస్థితులను, బంధువుల యోగ క్షేమాలను ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకునేవారు. తమ వారి కోసం పార్థనలు చేశారు. వెళ్లిన వారు క్షేమంగా రావడంతో యాత్రికుల బంధువు, దారుషిఫా నివాసి మీర్ ఫిరాసత్ హలీ బాకరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఫలించాయన్నారు. అరబ్బు దేశాలతో ప్రత్యేక అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాక్ దేశానికి 6వ నిజాం మీర్ మహెబుబ్ అలీ కాలం నుంచే అనుబంధం ఉంది. 6వ నిజాం తన వ్యక్తిగత రక్ష, దేశ రక్షణ కోసం అరబ్బు దేశాల నుంచి పెద్ద ఎత్తున అరబ్బు దేశస్తులను సైన్యంలో నియమించారు. వారి కుటుంబాల కోసం ఇళ్లను కేటాయించారు. ఆ క్రమంలోనే నగరంలోని ఏ.సీ గార్డు, ఫస్టు లాన్సర్, సెకండ్ లాన్సర్, బార్కస్ తదితర ప్రాంతాల్లో అరబ్బు దేశస్థులు స్థిరపడ్డారు. నగరం నుంచి.. ముస్లింల అన్ని పుణ్యక్షేత్రాలు అరబ్బు దేశాల్లోనే ఉన్నాయి. ఏటా నగరం నుంచి వేల సంఖ్యలో హజ్, ఉమ్రా యాత్రకు వెళ్తుంటారు. టోలిచౌకి, షేక్‌పేట, మెహిదీపట్నం, మురాద్‌నగర్, ఆసిఫ్‌నగర్, మొగల్పురా, మలక్‌పేట, కిల్వత్, బార్కస్ తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అరబ్బుదేశాలకు వెళ్లారు. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విధంగా భాగ్యనగారానికి, అరబ్బుదేశాలకు సంబంధం ఏర్పడింది. ఆ దేశాల్లో ఏ ప్రమాదం జరిగిన ఇక్కడి వారు విలవిలలాడుతుంటారు. ప్రస్తుతం ఇరాక్ పరిణామాలతో నగర ప్రజలు అక్కడ నివసిస్తున్న తమ వారు పడుతున్న ఇబ్బందులను తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రశాంతం... నేను ప్రతిసారి షాబాన్ మాసంలో పుణ్యయాత్ర కోసం భక్తులను ఇరాక్ గత ఐదేళ్ల నుంచి తీసుకెళ్లుతున్నాను. ఈసారి ఇరాక్‌లో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. మేం వెళ్లిన ప్రాంతాల్లో తీవ్రవాదుల ప్రభావం లేదు. కార్బలా, నజఫ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది. అన్నపానీయాలకు, రవాణ సౌకర్యలకు కొద్దిగా ఇబ్బందిపడ్డాం. అందరం క్షేమంగా నగరానికి వచ్చాం. - అలీ హుస్సేన్ జైదీ, టూర్ ఆపరేటర్