ఇరాక్‌లో అమెరికా దాడులు
మిలిటెంట్లపై విరుచుకుపడిన అగ్రరాజ్యం
వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు అమెరికా బలగాలు శుక్రవారం వైమానిక దాడులు ప్రారంభించాయి. ఉత్తర ఇరాక్‌లో ఐఎస్ మిలిటెంట్లకు చెందిన ఓ శతఘ్నిదళంపై అమెరికా ఫైటర్ జెట్‌లు రెండు లేజర్ గెడైడ్ బాంబులు జారవిడిచాయి. అవసరమైతే ఐఎస్ మిలిటెంట్లపై గగనతల దాడులు మొదలుపెడతామని ఒబామా గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాయవ్య ఇరాక్‌లోని సింజర్ కొండప్రాంతంలో చిక్కుకున్న మైనారిటీ ప్రజలను కూడా రక్షించాల్సిందిగా ఒబామా తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇరాక్‌లోని యాజిదీ మైనారిటీ ప్రజలను ఇస్లామిక్ మిలిటెంట్లు ఊచకోత కోస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
ఆహారం, నీరు లేకుండా కొండపై చిక్కుకున్న వేలాది మంది మైనారిటీ పౌరులను ఆదుకోవాలని ఆయన తమ దళాలను ఆదేశించారు. ఇరాక్‌లోని కుర్దుప్రాంతంలో ఉన్న ఎర్బిల్‌వైపు మిలిటెంట్లు ఒక్క అడుగు ముందుకు వేసినా వారిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పట్టణంలోని కాన్సులేట్‌లో పలువురు అమెరికా దౌత్య అధికారులు, పౌరులు పనిచేస్తున్నారు. ఇక్కడేకాదు, ఇరాక్‌లో ఎక్కడైనా ఇస్లామిక్ మిలిటెంట్లు అమెరికన్లవైపు కన్నెత్తి చూసినా ఊరుకోబోమన్నారు. ఒబామా ఆదేశాల నేపథ్యంలో సున్నీ మిలిటెంట్లపై వైమానిక దాడులను ప్రారంభించామని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం పెంటగన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఇరాక్‌లోని వాయవ్య ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని పోరు సాగిస్తున్న మిలిటెంట్లు శుక్రవారం అన్బర్ ప్రావిన్స్‌లో ఓ విద్యుత్ కేంద్రంపై దాడిచేయగా పోలీసులు, ఆర్మీ, స్థానిక గిరిజనులు కలిసి తిప్పికొట్టారు. ఈ సంఘటనలో 25 మంది జిహాదిస్టులు హతమయ్యారు.
ఇరాక్ ప్రభుత్వానికి అండగా నిలవండి..
ఇరాక్ సంక్షోభ నివారణకు అక్కడి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరింది. మిలిటెంట్లపై వైమానిక దాడులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్న వార్తలను ఇరాక్ ఖండించింది. అమెరికా దాడులను ఇరాకీలు, కుర్దిష్‌లు ఆహ్వానించారు. ఇరాక్‌లో జిహాదిస్టుల దాడులు ఎదుర్కొంటున్న క్రైస్తవులు, ఇతరులకు సంఘీభావం కోసం తాను ప్రత్యేక దూతను పంపనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు.