సాక్షి, సిటీబ్యూరో: ఇరాక్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు నగరానికి ఆదివారం క్షేమంగా చేరుకున్నారు. ఏటా షియా ముస్లింలు నాల్గుసార్లు ఇరాక్‌లోని పుణ్యక్షేత్రమైనా కర్బాలా, నజఫ్ ప్రాంతాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ (పాతబస్తీ, దారుషిఫా, నూర్‌ఖాన్‌బజార్) నుంచి 350 యాత్రికులు 12 బృందాల్లో పుణ్యక్షేత్రాలకు బయల్దేరి వెళ్లారు. షబేబరాత్ రాత్రి కర్బాలా మైదానంలో జరిగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తమ పూర్వీకుల త్యాగాలను స్మరించుకున్నారు. వీరిలో 290 మంది కొన్ని రోజుల క్రితమే నగరానికి చేరుకోగా.. మిగిలిన 60 మంది ఆదివారం క్షేమంగా వచ్చారు.
ప్రార్థనలు ఫలించాయి..
ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడికి వెళ్లిన తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు అక్కడి జరుగుతున్న పరిస్థితులను, బంధువుల యోగ క్షేమాలను ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకునేవారు. తమ వారి కోసం పార్థనలు చేశారు. వెళ్లిన వారు క్షేమంగా రావడంతో యాత్రికుల బంధువు, దారుషిఫా నివాసి మీర్ ఫిరాసత్ హలీ బాకరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఫలించాయన్నారు.
అరబ్బు దేశాలతో ప్రత్యేక అనుబంధం
హైదరాబాద్ నగరానికి ఇరాక్ దేశానికి 6వ నిజాం మీర్ మహెబుబ్ అలీ కాలం నుంచే అనుబంధం ఉంది. 6వ నిజాం తన వ్యక్తిగత రక్ష, దేశ రక్షణ కోసం అరబ్బు దేశాల నుంచి పెద్ద ఎత్తున అరబ్బు దేశస్తులను సైన్యంలో నియమించారు. వారి కుటుంబాల కోసం ఇళ్లను కేటాయించారు. ఆ క్రమంలోనే నగరంలోని ఏ.సీ గార్డు, ఫస్టు లాన్‌సర్, సెకండ్ లాన్‌సర్, బార్కస్ తదితర ప్రాంతాల్లో అరబ్బు దేశస్థులు స్థిరపడ్డారు.
నగరం నుంచి..
ముస్లింల అన్ని పుణ్యక్షేత్రాలు అరబ్బు దేశాల్లోనే ఉన్నాయి. ఏటా నగరం నుంచి వేల సంఖ్యలో హజ్, ఉమ్రా యాత్రకు వెళ్తుంటారు. టోలిచౌకి, షేక్‌పేట, మెహిదీపట్నం, మురాద్‌నగర్, ఆసిఫ్‌నగర్, మొగల్‌పురా, మలక్‌పేట, కిల్వత్, బార్కస్ తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అరబ్బుదేశాలకు వెళ్లారు. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విధంగా భాగ్యనగారానికి, అరబ్బుదేశాలకు సంబంధం ఏర్పడింది. ఆ దేశాల్లో ఏ ప్రమాదం జరిగిన ఇక్కడి వారు విలవిలలాడుతుంటారు. ప్రస్తుతం ఇరాక్ పరిణామాలతో నగర ప్రజలు అక్కడ నివసిస్తున్న తమ వారు పడుతున్న ఇబ్బందులను తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు.
పుణ్యక్షేత్రాల్లో ప్రశాంతం...
నేను ప్రతిసారి షాబాన్ మాసంలో పుణ్యయాత్ర కోసం భక్తులను ఇరాక్ గత ఐదేళ్ల నుంచి తీసుకెళ్లుతున్నాను. ఈసారి ఇరాక్‌లో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. మేం వెళ్లిన ప్రాంతాల్లో తీవ్రవాదుల ప్రభావం లేదు. కార్బలా, నజఫ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది. అన్నపానీయాలకు, రవాణ సౌకర్యలకు కొద్దిగా ఇబ్బందిపడ్డాం. అందరం క్షేమంగా నగరానికి వచ్చాం.
- అలీ హుస్సేన్ జైదీ, టూర్ ఆపరేటర్
ఇరాక్ యాత్రికులు క్షేమం
Published Mon, Jun 23 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
Advertisement