వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.
అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు
కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.
అత్యంత నిష్ఠతో పూజలు భజనలు
అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.
శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్
తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment