చేతి మణికట్టు నుంచి మోచేతి వరకు ఎక్కడైనా రక్త నాళాలను (సిరలు) గుర్తించి వాటిలోకి సూది మందులను ఎక్కించడానికి నైపుణ్యం అవసరం.
న్యూయార్క్: చేతి మణికట్టు నుంచి మోచేతి వరకు ఎక్కడైనా రక్త నాళాలను (సిరలు) గుర్తించి వాటిలోకి సూది మందులను ఎక్కించడానికి నైపుణ్యం అవసరం. ఎంత నైపుణ్యంగల నర్సులకైనా కొంత మంది రోగుల రక్తనాళాలను పట్టుకోవడం అంత సులభం కాదు. అలాంటి సందర్భాల్లో గుచ్చినచోట గుచ్చకుండా సూదులు గుచ్చిగుచ్చి రోగులను అనవర బాధకు గురిచేస్తారు. ‘అలా గుచ్చిగుచ్చి చంపకే’ అంటూ ఎంత మొరపెట్టుకున్నా వినే నర్సులుండరు. ఇక అలాంటి బాధను అనుభవించాల్సిన అవసరం రోగులకు లేదు. రక్త నాళాలను పట్టుకోవడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం నర్సులకూ లేదు. చేతులపై రక్త నాళాలను ఇట్టే గుర్తించే ‘క్రిష్టీ వీన్ వ్యూయర్’ అనే పరికరాన్ని అమెరికాకు చెందిన ‘క్రిష్టీ మెడికల్ హోల్డింగ్స్’ కంపెనీ తయారు చేసింది. ‘ఇన్‌ఫ్రారెడ్’ లైట్‌ను విడుదల చేయడం ద్వారా ఈ పరికరం చేతి చర్మం కిందనున్న రక్త నాళాలను వాటిలో ప్రవహించే హిమోగ్లోబిన్ ద్వారా గుర్తించి, రక్తనాళాల అమరిక ఫొటోతీసి చర్మం ఉపరితలంపై ప్రసరింపచేస్తోంది. ఆ ఫొటో ద్వారా అవసరమైన రక్తనాళాన్ని దొరకబుచ్చుకొని సూది మందులను శరీరంలోకి ఎక్కించడం ఎంతో సులభం. ప్రయోగాత్మకంగా ఈ పరికరాన్ని ఉపయోగించి చూసిన అమెరికాలోని కొన్ని ఆస్పత్రులు పరికరం పనితీరును ప్రశంసిస్తున్నారు.