ఆమె మరణం.. ఓ మిస్టరీ! | Elisa Lam Drowned in a Water Tank Three Years Ago | Sakshi
Sakshi News home page

ఆమె మరణం.. ఓ మిస్టరీ!

Published Thu, Dec 22 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

ఆమె మరణం.. ఓ మిస్టరీ!

ఆమె మరణం.. ఓ మిస్టరీ!

‘‘ఇది అనుమానాస్పదమే. అలాగే కపట నాటకం కూడా కావొచ్చు. దయచేసి ప్రజలంతా సహకరించాలి. తప్పిపోయింది ఓ విదేశీ యువతి. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి. మీకు కనిపించినట్లయితే ఆమె ఆచూకీ తెలియజేయండి..’’ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ప్రకటన చేసి, ఓ వీడియో విడుదల చేశారు లాస్‌ ఏంజిలెస్‌ పోలీసులు. అమెరికాలో పర్యాటకులు కనిపించకుండా పోవడం అరుదేమీ కాదు. అలాగని, తరచూ ఇలాగే జరుగుతుందనీ కాదు. కానీ, ఈ ‘ఎలిసా లామ్‌’ కేసు మాత్రం అమెరికన్లలో ఎక్కడలేని ఆసక్తినీ కలిగించింది. ఇది మామూలు మిస్సింగ్‌ కేసు కాకపోవచ్చనీ, దీని వెనక పెద్ద మిస్టరీనే ఉండొచ్చనీ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావించారు..!          

2013, జనవరి 31.. హాంక్‌కాంగ్‌ సంతతికి చెందిన కెనడా యువతి, 21 ఏళ్ల ఎలీసా లామ్‌.. లాస్‌ ఏంజిలెస్‌లోని సిసిల్‌ హోటెల్‌లో తన గదిలో ఉంది. బయట విపరీతమైన చలి ఉండటంతో ఆ సాయంత్రమంతా ఆమె గది నుంచి బయటకు రాలేదు. అప్పటికి మూడు రోజుల క్రితమే కెనడా నుంచి అమెరికాకు చేరుకుందామె. కాలేజీ చదువుల నుంచి కాస్తంత ఉపశమనం కోసం ఆమె ఒంటరిగానే ప్లాన్‌ చేసుకున్న టూర్‌ అది. అయితే, అలా ఒంటరిగా ప్రయాణాలు చేయడం ఎలీసా తల్లిదండ్రులకు అంత ఇష్టం లేదు. కానీ, తమ కుమార్తె ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందని ఆమె ఇష్టానుసారం విడిచిపెట్టారు. ఏదేమైనా, ఎక్కడున్నా ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఓ ఫోన్‌కాల్‌ చేసి, తన యోగక్షేమాలు చెబుతుంది ఎలీసా.

కానీ, ఆరోజు ఆమె నుంచి ఎలాంటి ఫోన్‌కాల్‌ రాలేదు. సమయం గడుస్తోంది. అర్ధరాత్రి కావస్తోంది. ఎలీసా తన గది నుంచి బయటకు వచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న హోటల్‌ లాంజ్‌లోంచి నడుచుకుంటూ వచ్చి, ఎలివేటర్‌లోకి దూరింది. ఏదో ఫ్లోర్‌కు వెళ్లేందుకు బటన్‌ నొక్కింది. అందరిలాగే ఎలివేటర్‌ గోడలకు నడుము ఆనించి రిలాక్స్‌ అయింది. అయితే, కొద్ది సెకన్లకే మూసుకోవాల్సిన ఎలివేటర్‌ తలుపులు మూసుకోలేదు. ఏదో తేడాగా అనిపించింది ఎలీసాకు. మరోసారి బటన్‌లను నొక్కింది. ఒకటికి రెండు సార్లు బటన్‌లను నొక్కుతూనే ఉంది.

ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. ఎలీసా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తనను ఎవరో తరుముతున్నట్టు భయపడసాగింది. ఎలివేటర్‌లోని ఓ మూలకు చేరి దాక్కున్నట్టుగా నిల్చుంది. అయితే, అప్పటికి ఆ పరిసరాల్లో ఎలీసా తప్ప ఎవరూ లేరు. కొన్ని సెకన్ల పాటు అలాగే నిల్చున్న ఆమె.. కాస్తంత ధైర్యం చేసి ఎలివేటర్‌ నుంచి బయటకు తొంగిచూసింది. ఎవ్వరూ కనిపించలేదు. దీంతో యథావిధిగా ఎలివేటర్‌లోకి వచ్చేసింది. మళ్లీ బటన్‌లను నొక్కడం ప్రారంభించింది. అదేం విచిత్రమో గానీ, ఎలివేటర్‌ తలుపులు ఎంతసేపటికీ మూసుకోలేదు.

దీంతో మరోసారి ఎలివేటర్‌ నుంచి బయటకు వచ్చింది ఎలీసా. కుడివైపు చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా సంజ్ఞలు చేసింది. అయితే, నిజానికి ఆమె ముందు ఎవ్వరూ లేరు. చేతి వేళ్లు విచిత్రంగా వంచుతూ, నడక సైతం అనుమానాస్పదంగా మార్చివేసింది. ఎవరో ఆమె నుదుటి మీద తుపాకీ పెట్టి బెదిరించినట్టుగా, చేతులు రెండూ పైకి లేపి, తిరిగి ఎలివేటర్‌లోకి ప్రవేశించింది. చివరగా కొద్ది సెకన్ల తర్వాత ఎలివేటర్‌ నుంచి పూర్తిగా బయటకు వెళ్లి, అక్కడి నుంచి ఎడమవైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఇదే పోలీసులు విడుదల చేసిన వీడియో ఫుటేజీలో కనిపించిన దృశ్యం. ఇదే యావత్‌ ప్రపంచాన్నీ అశ్చర్యపోయేలా చేసింది. ఆమె ఎవర్ని చూసి భయపడుతోందో, ఎవరితో మాట్లాడుతోందో, ఎందుకు చేతులు పైకి లేపి సరెండర్‌ అయ్యిందో.. ఎవరికీ అంతుపట్టలేదు. ఇంకో  ఆశ్చర్యకర అంశమేంటంటే.. ఎలివేటర్‌ పనిచేయడం లేదని నిర్ధారించుకుని ఎలీసా బయటకు వెళ్లిపోయిన మరుక్షణమే అది పనిచేయడం ప్రారంభించింది. ఆమె బటన్‌లు నొక్కిన ప్రతి ఫ్లోర్‌లోనూ ఆగింది.

ఇది జరిగిన మరుసటి రోజే ఎలీసా తల్లిదండ్రుల నుంచి లాస్‌ ఏంజిలెస్‌ పోలీసులు ఫోన్‌కాల్‌ అందుకున్నారు. తమ కుమార్తె నుంచి వచ్చే రోజువారీ ఫోన్‌కాల్‌ రాలేదని, ఆమె ఆచూకీ చెప్పాలనీ ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన వారం రోజులకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేసి, ఆచూకీ తెలపాల్సిందిగా ప్రకటన జారీ చేశారు. మరో మూడు వారాల తర్వాత.. ఫిబ్రవరి 19న పద్నాలుగు అంతస్తుల సిసిల్‌ హోటల్‌ పైభాగంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో ఆమె శవంగా తేలింది.

ఇదెలా జరిగిందో పోలీసులకు అర్థం కాలేదు. ఎలివేటర్లో తప్ప, బయట సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఆ రాత్రి ఏం జరిగిందీ ఎవరికీ తెలియరాలేదు. కానీ, పది అడుగులపైగా ఎత్తున్న, ప్రవేశించడం వీలు కాని వాటర్‌ ట్యాంకర్లలోకి ఎలీసా దేహం ఎలా చేరిందో కూడా ఎవరికీ అంతుచిక్కలేదు. హత్య, అత్యాచారం ఆనవాళ్లు కానరాలేదు. ఆమె బ్యాగులో కొన్ని డ్రగ్స్‌ కనిపించినప్పటికీ, శరీరంలో ఎలాంటి మత్తు పదార్థాల అవశేషాలూ కనిపించలేదు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే వాదనలు వినిపించాయి. అయితే, పూర్తిగా మూసి ఉండే ట్యాంకర్‌లోకి రెండో వ్యక్తి సహాయం లేకుండా ఐదు అడుగుల ఎత్తున్న ఎలీసా ప్రవేశించడం సాధ్యం కాదని హోటల్‌ సిబ్బంది చెప్పారు. ఆమె మృతదేహం ఆ ట్యాంకర్‌లోకి చేరడమే వారి దృష్టిలో ఓ అద్భుతంగా మారిపోయింది. సీసీటీవీ ఫుటేజీ యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ కావడంతో ఆమె మరణంపై వేర్వేరు సిద్ధాంతాలు వెలువడ్డాయి. ఎవరికి వారే డిటెక్టివ్‌లుగా మారిపోయి, ఏవేవో థియరీలతో వీడియోలు పోస్ట్‌ చేశారు. గత కొన్నేళ్లలో జరిగిన అత్యంత మిస్టీరిస్‌ సంఘటనగా ‘ఎలీసా లామ్‌’ మరణం నిలిచిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement