
ఎమర్సన్ మునంగాగ్వా
హరారే: జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ మునంగాగ్వా(75) విజయం సాధించారు. గతేడాది నవంబర్‌లో రాబర్ట్ ముగాబేను గద్దె దించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎమర్సన్‌కు 50.8 శాతం ఓట్లు, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. ‘ఇదో కొత్త ఆరంభం. ప్రేమ, శాంతి, ఐకమత్యంతో కొత్త జింబాబ్వేని నిర్మించుకునేందుకు మనమందరం చేతులు కలుపుదాం’ అని ఫలితాల వెల్లడి అనంతరం ఎమర్సన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామని, లేదంటే వీధుల్లో ఆందోళన చేస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి.
ఎన్నికల ఫలితాలను పూర్తిగా తిరస్కరిస్తున్నామని ప్రతిపక్ష నేత చమీసా కూటమి చీఫ్ ఏజెంట్ మోర్గెన్ కొమిచి అన్నారు. ఈ ఎన్నికలు మోసపూరితమని, ప్రతిదీ చట్ట విరుద్ధంగానే జరిగిందని ఆరోపించారు. ఎమర్సన్ గెలుపును ధ్రువీకరించే పత్రాలపై సంతకం చేయాలన్న ఎన్నికల సంఘం విజ్ఞప్తిని తిరస్కరించినట్లు చెప్పారు. జింబాబ్వేను 37 ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించిన రాబర్ట్ ముగాబేను గతేడాది నవంబర్‌లో పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ఈ ఎన్నికల్లో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను–పీఎఫ్) పార్టీకి 144 స్థానాలు, మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ చేంజ్ (ఎండీసీ) కూటమికి 64 స్థానాలు, నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్‌కు ఒక స్థానం లభించాయి.