
వాషింగ్టన్: ట్వీటర్‌లో చురుగ్గా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను గురువారం ట్వీటర్ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేసే ఉద్యోగి ఒకరు 11 నిమిషాల పాటు డీయాక్టివేట్ చేశారు. వెంటనే తేరుకున్న ట్వీటర్ యాజమాన్యం ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. చివరిరోజు విధులు నిర్వహిస్తున్న కస్టమర్ సపోర్ట్ ఉద్యోగి ఒకరు పొరపాటున ట్రంప్ ట్వీటర్ ఖాతాను డీయాక్టివేట్ చేశారని వివరణ ఇచ్చింది. ఈ విషయమై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘ ఓ రోగ్ నా ఖాతాను నిలిపివేశాడు. దీన్ని బట్టి నా మాటలు ప్రజలు వింటున్నారనీ, వారిపై నా మాటలు ప్రభావం చూపిస్తున్నాయని అర్థమవుతోంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.