వారి కోసం చైనా ఏం చేస్తోందంటే.. | Every Parent Wants Niuwa Child In China | Sakshi
Sakshi News home page

సూపర్‌ కిడ్స్‌ కోసం చైనా ఆరాటం

Published Thu, Nov 8 2018 1:10 PM | Last Updated on Fri, Nov 9 2018 8:22 AM

Every Parent Wants Niuwa Child In China - Sakshi

అమ్మ గర్భంలో ఉన్నపుడు... విదేశీ భాష వినడం
నాలుగేళ్ల వయసులో.. బైలింగ్వల్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లో చేరిక
ఆరో ఏడు వచ్చే నాటికి... హ్యారీ పోటర్‌ నవలల అవపోసన
ఎనిమిదో పుట్టినరోజు వేళకి... ప్రఖ్యాత ఐఈఎల్‌టీస్‌ స్కోర్‌ 7


ఇదీ చైనాకు చెందిన ‘నియువా’ అదే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సూపర్‌ టాలెంట్‌ కిడ్‌ తొమ్మిదేళ్ల ‘బాబీ జో’ ఆల్‌టైమ్‌ ట్రాక్‌ రికార్డు. ఇవేకాదు రెండో ప్రపంచ యుద్ధం గురించిన పూర్తి అవగాహన అతడి సొంతం. ఎంతో కఠిన పదాలతో కూడిన పుస్తకాన్నైనా సరే కేవలం గంటన్నరలో పూర్తి చేయడం బాబీ ప్రతిభకు నిదర్శనం.

చైనాలోని ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా బాబీ లాగే నియువా కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఉద్యోగాలను సైతం వదిలి సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌లను ‘ఉత్పత్తి’ చేసే ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసే ఒక్క చాన్స్‌కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశమే గనుక దక్కితే తమ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు పడినట్లేనని భావిస్తున్నారే తప్ప... కేరింతలతో గడవాల్సిన తమ చిన్నారుల బాల్యం ఛిద్రమైపోతుందని గుర్తించలేకపోతున్నారు. ప్రపంచమే కుగ్రామమైన నేటి యుగంలో నెగ్గుకురావాలంటే ఈ మాత్రం కఠినంగా ఉండక తప్పదంటూ తమ చర్యలను సమర్థించుకుంటున్నారు కూడా.

చైనాలోని విదేశీయుల పిల్లల కోసం..
ప్రస్తుతం నియువాల ఉత్పత్తి కోసం చైనాలో పెద్ద యఙ్ఞమే జరుగుతోంది. ఒకప్పుడు... చైనాలో నివసించే విదేశీయుల పిల్లల కోసం స్థాపించిన బైలింగ్వల్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లపై చైనీయులు మోజు పెంచుకుంటున్నారు. అందుకే బీజింగ్‌, షాంఘై, షెంజన్‌ వంటి ప్రధాన నగరాల్లో ఈ స్కూళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. న్యూస్కూల్‌ ఇన్‌సైట్‌ అనే బీజింగ్‌ సర్వే సంస్థ ప్రకారం 2015-17 మధ్య బైలింగ్వల్‌ ఇంటర్నేషనల్‌ సంఖ్య సుమారు 30 శాతం పెరిగిందంటే.. వీటి ప్రభావం చైనీయులపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అసలు అక్కడ ఏం నేర్పుతారు?
బైలింగ్వల్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో మొత్తం విదేశీ టీచర్లే ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందిన వారే ఉంటారు. ప్రతిరోజూ ఇంగ్లీష్‌ భాషలో డిబేట్లు నిర్వహించడం వారి ముఖ్యవిధి. దీనితో పాటుగా ఆర్ట్స్‌, సైన్స్‌, ఫిలాసఫీకి సంబంధించిన ముఖ్య విషయాలు బోధిస్తారు. అంతేకాదు సంగీతం, కరాటే, క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వారిని మెరికల్లా తీర్చిదిద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. వీటితో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో(పాశ్చాత్య సంస్కృతి)నూ తమదైన ముద్ర వేసేందుకు వారిని సిద్ధం చేస్తారు. ఈ విషయంలో పిల్లల వయసుతో వాళ్లకు సంబంధం ఉండదు. ఏడాదిన్నర చిన్నారి మొదలు ఐదేళ్ల బాలబాలికలు వారికి సమానమే. టీచర్లు ఇంత నిబద్ధతతో పని చేస్తారు కాబట్టే.. అందుకే తమ టార్గెట్‌ను పూర్తి చేసే విషయంలో ఈ అంతర్జాతీయ బడులు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. ఈస్ట్‌ మీట్స్‌ వెస్ట్‌ ఎడ్యుకేషన్‌ అనే కాన్సెప్టును పక్కాగా అమలు చేయడంలో విజయం సాధిస్తున్నాయి.

అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదవాలిగా..!
‘మా పిల్లలకి భిన్న సంస్కృతులు అలవడాలి. వారి ప్రతిభ కేవలం చైనాకే పరిమితం కాకూడదంటే కచ్చితంగా ఇంగ్లీషుపై పట్టు సాధించాల్సిందే. అకడమిక్‌ ర్యాంకులతో పాటు అంతర్జాతీయ అంశాలను అర్థం చేసుకునే విద్య కూడా ముఖ్యం. అందుకే ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారని పేర్కొన్నారు దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన సామాజిక వేత్త డాక్టర్‌ హన్నా సూంగ్‌. తమ పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే బైలింగ్వల్‌ స్కూళ్లే దిక్కు అనే భావనలో వారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఏడాదికి సుమారు 30 వేల డాలర్ల ట్యూషన్‌ ఫీజుతో పాటుగా ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌ కోసం వందలాది డాలర్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

తప్పదంతే..!
‘పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనుకోవడంలో తప్పులేదు కానీ అది వారి బాల్యాన్ని చిదిమేసేలా ఉండకూడదు. బాల్యం నుంచే తమ చిన్నారులు అసాధారణ ప్రతిభ కనబరచాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు.. ఒక్కసారైనా వారి మానసిక పరిస్థితి గురించి ఆలోచించాలి. తమ పిల్లలు పాశ్చాత్య సంస్కృతికి అలవడాలనే ఈ విపరీత ధోరణి వల్ల చైనా సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉందని’ సంప్రదాయవాదులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడితే బయటి ప్రపంచంలో బతకడం కష్టమని వాదిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయినా ఇది కేవలం చైనా ఒక్క దేశానికే పరిమితమైన సమస్య కాదు కదా అని కొట్టిపారేస్తున్నారు. అవును ఇది కూడా వాస్తవమే కదా! మన దేశంలో కూడా పరిస్థితి ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదుగా.. ఏమంటారు!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement