
మద్యం తాగితే క్యాన్సర్..!
న్యూజిల్యాండ్ః మద్యం తాగేవారికి క్యాన్సర్ తప్పదంటున్నాయి తాజా నివేదికలు. మద్యంలో క్యాన్సర్ కారక ప్రభావాలపై పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు ఆల్కహాల్ క్యాన్సర్ కు దారితీస్తుందని కనుగొన్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ కారణంగా సంభవించిన క్యాన్సర్ తోనే అధికశాతం ప్రజలు చనిపోయినట్లు ఒటాగో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తాజా నివేదికల్లో వెల్లడించారు.
ఒటాగో విశ్వవిద్యాలయం క్రిస్ట్ చర్చ్ క్యాంపస్ కు చెందిన ఇద్దరు విద్యావేత్తలు టౌరంగా నుంచి తిమారు వరకూ సుమారు ఆరు సమావేశాలు ఏర్పాటు చేసి, క్యాన్సర్ కు మద్యానికి గల సంబంధాలను చర్చించారు. ఒక్క 2012 సంవత్సరంలో కేవలం ఆల్కహాల్ సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడి 236 మంది వరకూ మరణించినట్లు పరిశోధనలద్వారా తెలుసుకున్నారు. ఆల్కహాల్ పరిశ్రమలు.. మద్యంవల్ల కలిగే నష్టాలను, దానికి సంబంధించిన ఎన్నోవివరాలను ప్రజలకు తెలపడాన్ని విస్మరిస్తున్నాయని ప్రొఫెసర్ డౌ సెల్మ్యాన్ తెలిపారు. తాము నిర్వహించిన అధ్యయనాల్లో ఆల్కహాల్ కు క్యాన్సర్ కు మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తేలిందని, మద్యం వల్ల జరిగే నష్టాలను ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంసరం ఎంతో ఉందని డౌ తెలిపారు.
ఆల్కహాల్ తాగడంవల్ల శరీరంలోని కొన్ని అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా లివర్, కొలోన్, ఈసోఫేగస్, బ్రెస్ట్, ప్రొస్టేట్, పాంక్రియాసిస్ వంటివేకాక, మద్యం వల్ల చర్మానికి సంబంధించిన క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం ఉందని పరిశోధకుల నివేదికల ద్వారా తెలుస్తోంది. మద్యం అలవాటు ఉన్నవారిలో సెలివరీ ఎసిటాల్ డిహైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం అలవాటుకు దూరంగా ఉండటమే మంచిదని పరిశోధకులు తెలియజేస్తున్నారు.