ఆ.. పేరుతో అన్నీ తంటాలే...
లండన్ మహిళకు ఫేస్ బుక్ కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ఆమె పేరు విషయంలో ఫేస్ బుక్ అభ్యంతరాలు తెలిపినవార్త.. ఇప్పుడు స్థానికంగా సంచలనమైంది. ఆమెకు పెద్దలు శాస్త్రోక్తంగా పెట్టిన పేరు ఐసిస్ థామస్ (Isis Thomas) కావడం ఇప్పుడామెకు సమస్యగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ భూతం.. ఇప్పుడు ఆమె పేరునే మార్చుకోవాల్సిన పరిస్థితులను కల్పించింది.
బ్రిటన్ కు చెందిన 27 ఏళ్ళ ఐసిస్ థామస్ కు కొత్త అనుభవం ఎదురైంది. సామాజిక దిగ్గజం ఫేస్ బుక్ లో తన ఖాతాను తెరిచేందుకు ప్రయత్నించిన ఐసిస్ థామస్ కు అభ్యంతరం తెలపడంతో షాక్ కు గురైంది. ఫేస్ బుక్ లో ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఎటువంటి వివరాలనైనా, పేర్లనైనా అనుమతించే అవకాశం లేకపోవడంతో ఐసిస్ థామస్ పేరు గుర్తింపునకు సంబంధించిన పూర్తి ఆధారాలు పంపించమని అడగడం పెద్ద వార్తే అయ్యింది. బ్రిటన్ బ్రిస్టల్ వాస్తవ్యురాలైన ఐసిస్ థామస్.. ఫేస్ బుక్ లో ఖాతాను తెరిచేందుకు జూన్ 27న లాగిన్ అవ్వగా.. ఆమెకు పేరు సమస్య వచ్చినట్లు తెలిపింది. ఆమె అసలు పేరు ఐసిస్ థామస్ కాగా... మొదట తాను పనిచేసిన నగరానికి చెందిన పేరును కలిపి.. ఐసిస్ వోర్సెస్టర్ గా ఫేస్ బుక్ లో నమోదు చేసింది. అనంతరం పాస్ వర్డ్ కోసం ప్రయత్నించినప్పుడు ఫేస్ బుక్ అభ్యంతరం తెలపడంతో, తిరిగి మరోసారి వోర్సెస్టర్ పేరును తొలగించి ఐసిస్ థామస్ గా నమోదు చేసింది. అయినప్పటికీ అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతోపాటు, కంప్యూటర్ స్క్రీన్ పై వచ్చిన సందేశాన్నిచూసి బిత్తరపోయింది. అసలు సమస్య ఐసిస్ తోనే వస్తోందని చివరికి తెలుసుకుంది. ఐసిస్ అనే పేరును అనుమతించేది లేదని, అది వారి పాలసీలకు విరుద్ధమని ఫేస్ బుక్ తన సందేశంలో తెలిపింది. ఆమె పేరులోని ఐసిస్ కు సంబంధించిన గుర్తింపు ఆధారాలను సమర్పించాలని కోరినట్లు కూడ థామస్ వెల్లడించింది.
ఐసిస్ అనేది ఈజిప్టుకు చెందిన ఓ దేవత పేరు అని, ఎట్టిపరిస్థితుల్లోనూ తన పేరును మార్చుకోవడం కుదరదంటున్న ఆమె... తనకు ఆ సామాజిక మాధ్యమంలో ప్రవేశించే అవకాశం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పేరుపై వచ్చిన అభ్యంతరాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది. ఇలా కొందరు సామాన్య ప్రజలేకాక కొన్ని సంస్థలు సైతం ఐసిస్ పేరుతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన సుమారు 7 కోట్ల టర్నోవర్ కలిగిన ఐసిస్ ఫార్మాసూటికల్ కంపెనీకి సైతం ఇదే సమస్య ఎదురైంది. దీంతో 2015 లో సదరు కంపెనీ ఐసిస్ ఫార్మా నుంచి, లోనిస్ ఫార్మాగా మార్చుకుంది. అలాగే అమెరికాలో 35 ఏళ్ళ అనుభవం ఉన్న ఓ పుస్తకాల వ్యాపారి కూడ తన ఐసిస్ బుక్స్ అండ్ గిఫ్ట్ షాప్ పేరు మార్చుకోవాల్సి వచ్చింది.