asks
-
బీమా పాలసీ క్లెయిమ్ కాలేదా? ఈ స్టోరీ చదవండి
సాక్షి, ముంబై: ఆపద సమయంలో ఆదుకుంటుందన్న భరోసాతో బీమా (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పాలసీ తీసుకునే వినియోగదారులకు భారీ నిరాశ ఎదురయ్యే ఉదంతాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలో న్యాయ పోరాటం చేయడం కూడా చాలా అరుదు. కానీ ఒక పాలసీదారుని భార్య మాత్రం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై పోరుకు దిగారు. చట్టపరంగా తనకు దక్కాల్సిన పాలసీ సొమ్ముపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించి విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన దిగంబరరావు ఠాక్రే 2000 సంవత్సరంలో ఎల్ఐసీ నుంచి మూడు బీమా పాలసీలను తీసుకున్నారు. అనారోగ్యంతో మార్చి13, 2003న ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రత్న తనకు రావాల్సిన బీమా సొమ్మును చెల్లించాల్సిందిగా ఎల్ఐసీని కోరగా అందుకు ఆ సంస్థ తిరస్కరించింది. పాలసీ తీసుకునేముందు పాలసీదారుడు ఠాక్రే ఆస్తమాతో ఆసుపత్రిలో చేరడం తదితర విషయాలను దాచి పెట్టారని వాదించింది. దీంతో 2005లో ఆమె వార్ధాలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ఫోరమ్ ఆమె క్లెయిమ్‌ను చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. ఇందుకు నిరకారించిన ఎల్ఐసీ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఎన్‌సీడీఆర్‌సీలో రివ్యూ పిటిషన్ వేసింది. అయితే ఎల్ఐసీ వాదనను తిరస్కరించిన ఎన్సీడీఆర్సీ ఆమెకు రావాల్సిన రూ. 9.3 లక్షలు చెల్లించాలని తాజాగా ఆదేశించింది. ఎల్ఐసీ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవనీ, పైగా ఠాక్రేకు ఇంతకుముందు అలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎల్ఐసీ పాలసీ జారీ చేసే సమయానికి ఆరోగ్యంగా ఉన్నందున, ఆ కాంట్రాక్టును తొలగించలేమని ఎన్సీడీఆర్సీ ప్రిసైడింగ్ సభ్యుడు దీపా శర్మ వ్యాఖ్యానించారు. వినియోగదారుని అభ్యర్థనను బీమా సంస్థ తిరస్కరించడం సేవలో లోపంగానే పరిగణించాలని పేర్కొన్నారు. -
సుబ్రతారాయ్ కి మరోసారి ఊరట
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతారాయ్‌కు మరోసారి ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు జైలు నుంచి విముక్తి లభించాలంటే రూ.300కోట్లు చెల్లించాలని పేర్కొంది. గతంలో ఆగస్ట్ 3వ తేదీ వరకు వాయిదా వేసిన ఈ కేసును విచారించిన సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల ఆయన తల్లి మరణంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించింది. రూ. 500 కోట్ల రూపాయలు చెల్లిస్తానన్న సుబ్రతా 200.కోట్లు మాత్రమే చెల్లించడంతో మిగిలిన రూ. 300 కోట్లను త్వరలో చెల్లించాలని జస్టిస్ ఠాకూర్ , జస్టిస్ ఏకే సిక్రి, లతో కూడిన బెంచ్ ఆదేశించింది. సెప్టెంబర్ 15లోపు చెల్లించాలని లేదంటే జైలు కెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ కేసులో రూ.200 కోట్లను మాత్రమే డిపాజిట్ చేసిన సుబ్రతా మిగిలిన రూ.300 కోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు గడువివ్వాలని సుబ్రతారాయ్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
ఆ.. పేరుతో అన్నీ తంటాలే...
లండన్ మహిళకు ఫేస్ బుక్ కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ఆమె పేరు విషయంలో ఫేస్ బుక్ అభ్యంతరాలు తెలిపినవార్త.. ఇప్పుడు స్థానికంగా సంచలనమైంది. ఆమెకు పెద్దలు శాస్త్రోక్తంగా పెట్టిన పేరు ఐసిస్ థామస్ (Isis Thomas) కావడం ఇప్పుడామెకు సమస్యగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ భూతం.. ఇప్పుడు ఆమె పేరునే మార్చుకోవాల్సిన పరిస్థితులను కల్పించింది. బ్రిటన్ కు చెందిన 27 ఏళ్ళ ఐసిస్ థామస్ కు కొత్త అనుభవం ఎదురైంది. సామాజిక దిగ్గజం ఫేస్ బుక్ లో తన ఖాతాను తెరిచేందుకు ప్రయత్నించిన ఐసిస్ థామస్ కు అభ్యంతరం తెలపడంతో షాక్ కు గురైంది. ఫేస్ బుక్ లో ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఎటువంటి వివరాలనైనా, పేర్లనైనా అనుమతించే అవకాశం లేకపోవడంతో ఐసిస్ థామస్ పేరు గుర్తింపునకు సంబంధించిన పూర్తి ఆధారాలు పంపించమని అడగడం పెద్ద వార్తే అయ్యింది. బ్రిటన్ బ్రిస్టల్ వాస్తవ్యురాలైన ఐసిస్ థామస్.. ఫేస్ బుక్ లో ఖాతాను తెరిచేందుకు జూన్ 27న లాగిన్ అవ్వగా.. ఆమెకు పేరు సమస్య వచ్చినట్లు తెలిపింది. ఆమె అసలు పేరు ఐసిస్ థామస్ కాగా... మొదట తాను పనిచేసిన నగరానికి చెందిన పేరును కలిపి.. ఐసిస్ వోర్సెస్టర్ గా ఫేస్ బుక్ లో నమోదు చేసింది. అనంతరం పాస్ వర్డ్ కోసం ప్రయత్నించినప్పుడు ఫేస్ బుక్ అభ్యంతరం తెలపడంతో, తిరిగి మరోసారి వోర్సెస్టర్ పేరును తొలగించి ఐసిస్ థామస్ గా నమోదు చేసింది. అయినప్పటికీ అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతోపాటు, కంప్యూటర్ స్క్రీన్ పై వచ్చిన సందేశాన్నిచూసి బిత్తరపోయింది. అసలు సమస్య ఐసిస్ తోనే వస్తోందని చివరికి తెలుసుకుంది. ఐసిస్ అనే పేరును అనుమతించేది లేదని, అది వారి పాలసీలకు విరుద్ధమని ఫేస్ బుక్ తన సందేశంలో తెలిపింది. ఆమె పేరులోని ఐసిస్ కు సంబంధించిన గుర్తింపు ఆధారాలను సమర్పించాలని కోరినట్లు కూడ థామస్ వెల్లడించింది. ఐసిస్ అనేది ఈజిప్టుకు చెందిన ఓ దేవత పేరు అని, ఎట్టిపరిస్థితుల్లోనూ తన పేరును మార్చుకోవడం కుదరదంటున్న ఆమె... తనకు ఆ సామాజిక మాధ్యమంలో ప్రవేశించే అవకాశం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పేరుపై వచ్చిన అభ్యంతరాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది. ఇలా కొందరు సామాన్య ప్రజలేకాక కొన్ని సంస్థలు సైతం ఐసిస్ పేరుతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన సుమారు 7 కోట్ల టర్నోవర్ కలిగిన ఐసిస్ ఫార్మాసూటికల్ కంపెనీకి సైతం ఇదే సమస్య ఎదురైంది. దీంతో 2015 లో సదరు కంపెనీ ఐసిస్ ఫార్మా నుంచి, లోనిస్ ఫార్మాగా మార్చుకుంది. అలాగే అమెరికాలో 35 ఏళ్ళ అనుభవం ఉన్న ఓ పుస్తకాల వ్యాపారి కూడ తన ఐసిస్ బుక్స్ అండ్ గిఫ్ట్ షాప్ పేరు మార్చుకోవాల్సి వచ్చింది. -
ఐ ఫోన్ యూజర్లపై మరో కొత్త వల
మీరు యాపిల్ ఐ ఫోన్ వాడుతున్నారా? అయితే జర భద్రం. హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే మరో సరికొత్త మార్గానికి తెరలేపారు. టెక్స్ట్ సందేశం ద్వారా ఐ ఫోన్ యూజర్లను ట్రాప్ చేస్తున్న కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్ బీసీ బే ఏరియా. కాం అందించిన సమాచారం ప్రకారం ఒక సాధారణ మెసేజ్ ద్వారా యూజర్లను ప్రమాదంలోకి నెట్టే ప్రమాదానికి హ్యాకర్లు పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. మీ ఐ ఫోన్ ఐడి ఎక్స్పైర్ అయింది..ఫలానా లింక్ ను క్లిక్ చేయండి అనే మెసేజ్ ద్వారా ఐఫోన్ వినియోగదార్లను హ్యాక్ చేస్తోందని హెచ్చరిస్తోంది. తద్వారా యాపిల్ ఐ ఫోన్ ఖాతా ఐడి, పాస్ వర్డ్ వివరాలను సేకరిస్తోందని తెలిపింది. ఇలాంటి ప్రమాదకరమైన సందేశాలను కొంతమంది యూజర్లు ఇప్పటికే రిసీవ్ చేసుకున్నట్టు చెబుతోంది. వీటిని నమ్మి మోసపోవద్దంటూ ఐ ఫోన్ యూజర్లకు సూచిస్తోంది. 'మీ యాపిల్ ఐడి కాల పరిమితి ముగిసింది.. దీన్ని కొనసాగించాలంటే... సపోర్ట్ యాపిల్ లేదా యాపిల్ ఐడి లాగిన్ అనే వెబ్ సైట్లను క్లిక్ చేయమని' కోరుతుందని తెలిపింది. హాకర్లు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ హానికరమైన వెబ్ సైట్ ను యూజర్లు ఓపెన్ చేయగానే.. యాపిల్ ఐడి, పాస్ వర్డ్ ను తస్కరిస్తుందని, దీంతోపాటు పేరు, చిరునామా, బ్యాంకు కార్డుల వివరాలతో పాటు, పాస్‌పోర్ట్ వివరాలను కూడా అడుగుతుందని పేర్కొంది. దీన్ని గమనించి ఐ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. యాపిల్ సంస్థ ఇలాంటి సందేశాలను పంపదని, అసలు ఐడీ లను డిలీట్ చేయడం లాంటిది ఉండదని స్పష్టం చేసింది. యాపిల్ ఐడీ ఖాతాలు రెగ్యులర్ బేసిస్ గా ఉంటాయనే విషయాన్ని గమనించాలని కోరింది. దీనిపై యాపిల్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందేశాలకు స్పందించి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, పాస్వర్డ్ తదితర విస్తృతమైన వ్యక్తిగత వివరాలను మెయిల్ ద్వారా గానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా షేర్ చేయొద్దని సంస్థ చెబుతోంది. -
మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారు?
ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్... విదేశాలకు వెళ్ళకూడదంటూ ఆదేశాలు ఉన్నా... ఆయన రహస్యంగా లండన్ చెక్కేయడంపై ప్రస్తుతం రాజకీయ రచ్చగా మారింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్...మోదీని సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాలంటూ కేజ్రీవాల్ ట్వీట్ లో కోరారు. వేల కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు ఎగవేసిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్యాను దేశం వదిలి వెళ్ళేందుకు అనుమతించరాదంటూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాల్యా మార్చి 2వ తేదీ దేశం విడిచి వెళ్ళారంటే.. ఎవరి అనుమతితో వెళ్ళారని కేజ్రీవాల్ అన్నారు.