మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారు?
ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్... విదేశాలకు వెళ్ళకూడదంటూ ఆదేశాలు ఉన్నా... ఆయన రహస్యంగా లండన్ చెక్కేయడంపై ప్రస్తుతం రాజకీయ రచ్చగా మారింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
సమస్యల వలయంలో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్...మోదీని సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాలంటూ కేజ్రీవాల్ ట్వీట్ లో కోరారు.
వేల కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు ఎగవేసిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్యాను దేశం వదిలి వెళ్ళేందుకు అనుమతించరాదంటూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాల్యా మార్చి 2వ తేదీ దేశం విడిచి వెళ్ళారంటే.. ఎవరి అనుమతితో వెళ్ళారని కేజ్రీవాల్ అన్నారు.