ఐ ఫోన్ యూజర్లపై మరో కొత్త వల
మీరు యాపిల్ ఐ ఫోన్ వాడుతున్నారా? అయితే జర భద్రం. హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే మరో సరికొత్త మార్గానికి తెరలేపారు. టెక్స్ట్ సందేశం ద్వారా ఐ ఫోన్ యూజర్లను ట్రాప్ చేస్తున్న కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్ బీసీ బే ఏరియా. కాం అందించిన సమాచారం ప్రకారం ఒక సాధారణ మెసేజ్ ద్వారా యూజర్లను ప్రమాదంలోకి నెట్టే ప్రమాదానికి హ్యాకర్లు పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. మీ ఐ ఫోన్ ఐడి ఎక్స్పైర్ అయింది..ఫలానా లింక్ ను క్లిక్ చేయండి అనే మెసేజ్ ద్వారా ఐఫోన్ వినియోగదార్లను హ్యాక్ చేస్తోందని హెచ్చరిస్తోంది. తద్వారా యాపిల్ ఐ ఫోన్ ఖాతా ఐడి, పాస్ వర్డ్ వివరాలను సేకరిస్తోందని తెలిపింది. ఇలాంటి ప్రమాదకరమైన సందేశాలను కొంతమంది యూజర్లు ఇప్పటికే రిసీవ్ చేసుకున్నట్టు చెబుతోంది. వీటిని నమ్మి మోసపోవద్దంటూ ఐ ఫోన్ యూజర్లకు సూచిస్తోంది.
'మీ యాపిల్ ఐడి కాల పరిమితి ముగిసింది.. దీన్ని కొనసాగించాలంటే... సపోర్ట్ యాపిల్ లేదా యాపిల్ ఐడి లాగిన్ అనే వెబ్ సైట్లను క్లిక్ చేయమని' కోరుతుందని తెలిపింది. హాకర్లు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ హానికరమైన వెబ్ సైట్ ను యూజర్లు ఓపెన్ చేయగానే.. యాపిల్ ఐడి, పాస్ వర్డ్ ను తస్కరిస్తుందని, దీంతోపాటు పేరు, చిరునామా, బ్యాంకు కార్డుల వివరాలతో పాటు, పాస్పోర్ట్ వివరాలను కూడా అడుగుతుందని పేర్కొంది. దీన్ని గమనించి ఐ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. యాపిల్ సంస్థ ఇలాంటి సందేశాలను పంపదని, అసలు ఐడీ లను డిలీట్ చేయడం లాంటిది ఉండదని స్పష్టం చేసింది. యాపిల్ ఐడీ ఖాతాలు రెగ్యులర్ బేసిస్ గా ఉంటాయనే విషయాన్ని గమనించాలని కోరింది.
దీనిపై యాపిల్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందేశాలకు స్పందించి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, పాస్వర్డ్ తదితర విస్తృతమైన వ్యక్తిగత వివరాలను మెయిల్ ద్వారా గానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా షేర్ చేయొద్దని సంస్థ చెబుతోంది.