ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్
బ్రెజిల్: బ్రెజిల్ లో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ కు అక్కడి కోర్టులకు మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. లాటిన్ అమెరికా ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ డియెగో జోడెన్ ను మంగళవారం సావోపోలో లో బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించాల్సిందిగా జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు ఫెడరల్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కోర్టు జారీ చేసిన ఆదేశాలను మళ్లీ మళ్లీ బేఖాతరు చేయడం తీవ్రమైన కోర్టు ధిక్కారణకు కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు.
మాదక ద్రవ్యాల కేసు విచారణ సందర్భంగా సెర్జీప్ రాష్ట్ర న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వాట్సాప్ ద్వారా పంపిన సందేశాలు, విడుదల చేయడంలో సంస్థ నిరాకరించిందని, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల కేసుల విచారణలో సహకరించడం లేదని ఆరోపిస్తూ సమన్లు జారీ చేశారు. వీటికి స్పందించకపోవడంతో జోడెన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఖండించాడు. ఇది తనకు చాలా విస్మయాన్ని కలిగించదన్నారు. బ్రెజిల్ లో ఇదొక విచారకరమైన రోజని వ్యాఖ్యానించారు
కాగా గత ఏడాది డిసెంబర్ లో మరో బ్రెజిల్ లో కోర్టు వాట్సాప్ పై 48గంటల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ పరిధిలో ఉన్న వాట్సాప్ యాప్ నేర సంబంధిత విచారణకు సహకరించడంలో విఫలమవుతోందంటూ కోర్టు తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో నిరసనలు వెలువెత్తాయి.