ప్రపంచంలో పిల్లల మరణాలు తగ్గాయి
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా గడచిన కొన్ని దశాబ్దాలుగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయి. 2000 సంవత్సరంలో సంభవించిన పిల్లల మరణాలతో పోలిస్తే 2015 సంవత్సరంలో సంభవించిన పిల్లల మరణాలు 40 లక్షలు తక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలిందని ‘ది లాన్‌సెట్’ వైద్య పత్రిక వెల్లడించింది. 1990 నాటి నుంచి 2015 నాటి వరకు పరిశీలిస్తే ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు 53 శాతం తగ్గాయి.
ఇంతమాత్రానికే సంతోష పడాల్సిన అవసరం లేదని, 2000 సంవత్సరం నాటికి మూడింతలు తగ్గించాలనే ప్రపంచ లక్ష్యం నెరవేరనే లేదని వైద్య పత్రిక వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఈ పిల్లల మరణాలు తగ్గడం ఆనందదాయకమని పేర్కొంది. డయేరియా, మలేరియా, మీజిల్స్‌తోనే కాకుండా ప్రసవం సందర్భంగా కూడా పిల్లలు ఎక్కువగా మరణించేవారు. ఈ పిల్లల మరణాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కూడా నివేదిక పేర్కొంది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది పిల్లలు మరణించారు. వారిలో 27లక్షల మంది పురిట్లోనే చనిపోయారు. మొత్తం పిల్లల మరణాల్లో 60 శాతం మరణాలు ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా, చైనా, అంగోలా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, టాంజానియా దేశాల్లో సంభవించాయి. వీటిలో కొన్ని దేశాల్లో పిల్లల జననాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆయా దేశాల్లో మతులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతి వెయ్యి మంది పిల్లల్లో వంద మందికి పైగా పిల్లలు అంగోలా, చాద్, మాలి, నైజీరియా, సియెర్రా లియోన్, సోమాలియా దేశాల్లో ఎక్కువగా మరణిస్తున్నారు.