మార్కెట్లో మహిళా ఉగ్రవాది బీభత్సం
కానో: సూర్యుడు పూర్తిగా బయటికొచ్చాడు. కొనుగోలుదారుల రాక అప్పుడే మొదలైంది. ఆలస్యంగా చేరుకున్న వ్యాపారులు.. వాహనాల్లో అటుగా వేగంగా కదులుతున్నారు. ఇంతలోనే ఒక ఆటోలో అక్కడికి చేరుకుంది ఓ మహిళ. చూడటానికి కూరగాయల వ్యాపారిలా ఉంది. కానీ ఆమె దగ్గరున్న సంచుల్లో, ఒంటినిండా బాంబులే! మరేమీ ఆలోచించకుండా ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకుంది. రక్తపాతం సృష్టించిన ఈ సంఘటన ఈశాన్య నైజీరియాలోని మైదుగురి పట్టణంలో జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో పదుల సంఖ్యలో అమాయకులు దుర్మరణం చెందినట్లు తెలిసింది.
గడిచిన కొద్ది రోజులుగా కొత్త పంథాను అనుసరిస్తున్న బొకో హరాం ఉగ్రవాద సంస్థ.. మహిళా జీహాదీలతో ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నది. శుక్రవారం నాటి దాడే కాకుండా గత శనివారం దమతురులోని జనసమ్మర్థ మార్కెట్ వద్ద మహిళా ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయారు. అదే పట్టణంలో రంజాన్ పర్వదినాన ముగ్గురు బాలికలతో బొకోహరాం చేయించిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది చనిపోగా, పలువురికి గాయలయ్యాయి.