దుబాయ్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవన సముదాయంలోని 'టార్చ్'లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
దుబాయ్ : దుబాయ్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవన సముదాయంలో ఒకటైన 'టార్చ్' టవర్లో ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. భవన సముదాయంలోని 59వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వేలాదిమంది ఉండగా, అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తరలించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
బిల్డింగ్ మధ్య భాగంలో అగ్నిప్రమాదం జరగటంతో భవన సముదాయంలో చిక్కుకున్నవారు కొంతమంది మెట్ల ద్వారా కిందకు రాగా, మరికొందరు బిల్డింగ్ పైకి చేరుకున్నారు. చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మరోవైపు బయటకు వచ్చేందుకు అందరూ ఒక్కసారిగా మెట్లమార్గాన్ని ఆశ్రయించటంతో తొక్కిసలాట జరగటంతో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. 60వ అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల అంచనా. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.