కొండచిలువను దొంగిలించబోయి..
ఫ్లోరిడా: సాధారణంగా దొంగతనం అనగానే ఏ డబ్బులో.. నగలో.. ఇంకేదైనా వస్తువో దొంగిలించారని అనుకుంటారు. ఏ దొంగ అయినా అలాగే చేస్తాడు కూడా. ఎందుకంటే డబ్బయినా, బంగారమయినా.. ఇంకేదైనా వస్తువైనా ఉపయోగపడుతుంది కాబట్టి. కానీ, ఫ్లోరిడాలోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా దొంగతనం చేశాడు. ఓ పెంపుడు జంతువుల అమ్మకాలు జరిపే దుకాణంలోకి వెళ్లి తొలుత ఆయా విభాగాలన్నీ కలియ తిరిగాడు. చక్కగా స్టైలిష్ గా ఉన్న ఆ వ్యక్తి వేరేవయితే ఎటయినా పోతాయనుకున్నాడో.. లేక అరుస్తాయని అనుకున్నాడో.. ఏకంగా కొండ చిలువను దొంగిలించాడు.
ఓ రకంగా దాన్ని చూస్తేనే ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. అలాంటిది అతడు మాత్రం ఏ భయం లేకుండా అటూఇటు చూస్తూ చటుక్కున జేబులో వేసుకున్నాడు. అది కాస్త నిఘా నేత్రం(సీసీటీవీ)లో రికార్డవుతూ కనిపించింది. దాంతో వెంటనే అతడి దగ్గరకు దుకాణం యజమాని వచ్చి ఏం తీశావని అడిగాడు. తొలుత తాను ఏం తీయలేదని తాఫీగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడంతో ఓనర్ చేయి లేపాడు. దాంతో వెంటనే అతడు తన జేబులో నుంచి కొండ చిలువ తీసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. దొరికినంతసేపు అతడు ఆ వ్యక్తిని పిచ్చికొట్టుడుకొట్టాడు.