బుష్ Vs ట్రంప్: ప్రవాసం నుంచి పోరాటంలోకి | Former president George W. Bush ends exile, helps Republicans raise money | Sakshi
Sakshi News home page

బుష్ Vs ట్రంప్: ప్రవాసం నుంచి పోరాటంలోకి

Published Sat, Jun 18 2016 11:38 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

బుష్ Vs ట్రంప్: ప్రవాసం నుంచి పోరాటంలోకి - Sakshi

బుష్ Vs ట్రంప్: ప్రవాసం నుంచి పోరాటంలోకి

వాషింగ్టన్: సొంత శిబిరరమే శత్రువుగా భావిస్తోన్న డోనాల్డ్ ట్రంప్ నానాటికీ బలం పుంజుకుంటున్నాడు. అతని ప్రచండ వేగానికి తాళలేక రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి ఒక్కొక్కరు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటితే ట్రంప్ నే తమ అభ్యర్థిగా ప్రకటించాల్సిన పరిస్థితి. అలా జరగకూడదంటే ట్రంప్ పై బ్రహ్మాస్త్రాన్ని సంధించాలి. తద్వారా అస్మదీయులను ఆదుకోవాలి. ఆ తరుపుముక్క మరెవరోకాదు యూఎస్ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్. ఏడేళ్లుగా తనకుతాను విధించుకున్న ప్రవాసం నుంచి నిన్ననే బయటికి వచ్చిన జార్జ్ బుష్.. ట్రంప్ పై పోరాటానికి సిద్ధమయ్యారు. రిపబ్లికన్ సెనెటర్ల కోసం నిధుల సేకరణకు నడుం కట్టారు.

రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. పలు అంశాల్లో విద్వేషపూరితంగా వ్యవహరించే ట్రంప్ ను తన అభ్యర్థిగా అంగీకరించేదిలేదని తేల్చిచెప్పిన పార్టీ.. అసలు ఎన్నికల్లో ట్రంప్ కు అడ్డుకట్టవేసేలా ప్రణాలికలు రచిస్తోంది. దశాబ్ధాలుగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బుష్ కుటుంబాన్ని, వారి పలుకుబడిని ఉపయోగించుకోవడం ద్వారా సెనెటర్లకు నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఆ క్రమంలోనే తిరిగి పార్టీకోసం పనిచేయాలంటూ జార్జ్ బుష్ ను కొందరు సీనియర్ నేతలు సంప్రదించారు. రెండు దఫాలు అధ్యక్షుడిగా పనిచేసి, గడిచిన ఏడు సంవత్సరాలుగా ప్రవాసంలో గడుపుతున్న బుష్.. ఎట్టకేలకు పార్టీ అభ్యర్థనను మన్నిచారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సరేనన్నారు.

100మంది సభ్యుల అమెరికా సెనేట్ లో ప్రస్తుతం రిపబ్లికన్ల సంఖ్య 54. వీరిలో అత్యధికులు బలపరిచే వ్యక్తే రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అవుతాడు. అలా జరగొద్దంటే పార్టీ పెద్దలు సెనెటర్లను ట్రంప్ బారి నుంచి కాపాడుకోవాలి. వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించడం ద్వారా సెనెటర్లు ట్రంప్ వైపునకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. మాజీ అధ్యక్షుడిగా బుష్ తనకున్న పరిచయాల ద్వారా సెనెటర్ల కోసం నిధులు సేకరిస్తారు. ఆరిజోనా సెనెటర్ జాన్ మెక్ కెయిన్, న్యూ హాంప్ షైర్, ఒహియో, విస్కాన్సిస్, మిస్సౌరీల సెనెటర్లు కెల్లీ అయోట్, రాబ్ పోర్ట్ మెన్, ర్యాన్ జాన్సన్, రాయ్ బ్లంట్ ల తరఫున బుష్ ఫండ్ రైజింగ్ కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారయినట్లు సమాచారం. కాగా, ట్రంప్.. తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్రలను ఖండించారు. అభ్యర్థి ఎవరైనాసరే, ఎన్నికల్లో సహకరిస్తానని బుష్ గతంలో మాటిచ్చారని, ఇప్పుడా వాగ్ధానాన్ని భంగం చేస్తున్నారని విమర్శించారు.

కండోలిజా రైస్ కు కీలక పదవి?
జార్జి బుష్ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన కండోలిజా రైస్ ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే రైస్ వైస్ ప్రెసిడెంట్ కావడం ఖాయమని వైట్ హౌస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తోన్న రైస్ మాత్రం.. తనకు ఉపాధ్యక్ష పదవి చేపట్టే ఆసక్తి లేదని, పాఠాలు చెప్పడంలోనే ఆనందం ఉందని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement