నాలుగేళ్ల బాలుడికి యావజ్జీవ శిక్ష
కైరో: ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తిని, భద్రతా సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసిన కేసులో నాలుగేళ్ల బాలుడికి ఈజిప్టు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడు రెండేళ్ల క్రితం ఈ నేరాలకు పాల్పడ్డాడట. అంటే రెండేళ్ల వయస్సులోనే ఈ నేరాలన్ని చేశారంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. కానీ ఈజిప్టు కోర్టు నమ్మి మంగళవారం నాడు తీర్పు చెప్పింది. ఆ రోజున ఆ నాలుగేళ్ల బాలుడు లేకుండానే కోర్టు తీర్పు చెప్పడంతో ఆ బాలుడు ఎలా ఉంటారో చూడడానికి ఎవరికి అవకాశం లభించలేదు.
అహ్మద్ మన్సూర్ కర్ణి అనే నాలుగేళ్ల బాలుడిపై హత్యకు సంబంధించి నాలుగు అభియోగాలు, హత్యా యత్నానికి సంబంధించి ఎనిమిది అభియోగాలు, ఈజిప్టు ఆరోగ్య సంస్థకు చెందిన ఆస్తులను ధ్వంసం చేసినందుకు, ఆస్పత్రి సిబ్బందిని, భద్రతా సిబ్బందిని బెదిరించారనే అభియోగాలను విచారించిన పశ్చిమ కైరోలోని ఓ కోర్టు ఈ సంచలనాలకే సంచలనమైన తీర్పును వెలువరించింది. కేసును సరిగ్గా చదవకుండానే జడ్జీ తీర్పు చెప్పి ఉంటారని నిందితుడి తరఫు న్యాయవాది ఫైజల్ ఏ సయ్యద్ వ్యాఖ్యానించారు. ఈజిప్టులో న్యాయం జరగదనే విషయం మరోసారి రుజువైందని మొహమ్మద్ అబూ హురీరా వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చనిపోయిన వారికి మరణ శిక్షలు విధించిన చరిత్ర ఈజిప్టు కోర్టులకు ఉన్నప్పుడు ఇదేమి వింతకాకపోవచ్చని ఒకరు వ్యాఖ్యానించగా, నాలుగేళ్ల బాలుడి పేరు గల వ్యక్తి ఈ నేరాలకు పాల్పడితే అన్యాయంగా బాలుడిని ఇరికించారేమోనని కొందరు, నేరస్థుడి పుట్టిన రోజు తప్పుందేమో అని మరికొందరు ఆనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా కోర్టుకు క్లారిటీ ఉండాలికదా!