పొరపాటున బాంబు వేశాం: ఫ్రెంచ్ ప్రధాని
ఇరవై ఐదేళ్ళ తర్వాత ఫ్రాన్స్, న్యూజిల్యాండ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ న్యూజిల్యాండ్ లో పర్యటించడం అందుకు పెద్ద నిదర్శనంగా చెప్పాలి. అక్కడకు వెళ్ళడమేకాక, ఫ్రాన్స్ 31 ఏళ్ళ క్రితం న్యూజిల్యాండ్ పై జరిపిన దాడి పెను తప్పిదమంటూ వాల్స్ విశ్లేషించడం ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.
ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గ్రీన్ పీస్ పై 31 ఏళ్ళ క్రితం జరిపిన బాంబు దాడి పెను తప్పిదమేనన్నారు ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్. 25 సంవత్సరాల అనంతరం మొదటిసారి ఫ్రెంచ్ ప్రధాని న్యూజిల్యాండ్ ను సందర్శించారు. ఈ సందర్శన ఫ్రెంచ్, న్యూజిల్యాండ్ల మధ్య మైత్రిని పెంపొందించే అవకాశం ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ అభిప్రాయపడింది. 1985 జూలైలో ఫ్రెంచ్ గూఢచారులు... ఆక్లాండ్ ప్రధాన పట్టణం పై.. రెండు భారీ మైన్లతో దాడికి పాల్పడ్డాయి. ఫసిఫిక్ లో ఫ్రాన్స్ జరుపుతున్న అణ్వస్త్ర పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ప్రచారం కొనసాగిస్తున్నసమయంలో రైన్బో వారియర్ నౌక.. బాంబుదాడితో నిమిషాల్లో నీటిలో మునిగిపోయింది. అనంతరం దాడిలో పాల్గొన్న ఇద్దరు ప్రెంచ్ సీక్రెట్ ఏజెంట్లను న్యూజిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
30 సంవత్సరాలక్రితం మా సంబంధం పెద్ద పవాలుగా ఉండేదని, అప్పట్లో జరిగిన బాంబు దాడి తప్పిదమేనని, దాడితో చెరిగిపోయిన ఇరుదేశాల మధ్య బంధం... తిరిగి చిగురించాలని కోరుకుంటున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని వెల్లడించారు. జరిగిన తప్పిదాలను గుర్తుంచుకొని, అటువంటివి మరెప్పుడూ జరగకుండా చూసుకుంటూ...ఇరు దేశాలు కలసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని వాల్స్ ఆకాంక్షించారు. మరోవైపు.. బాంబు దాడి ఘోరమైన తప్పిదంగా ఫ్రాన్స్ అంగీకరించడం మంచి పరిణామమని న్యూజిల్యాండ్ ప్రధాని జాన్ కీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆక్లాండ్ లో వాల్స్ తో చర్చలు జరిపిన అనంతరం న్యూజిల్యాండ్ నష్టాన్ని, బాధను ఫ్రాన్స్ అర్థం చేసుకొందని అటువంటి సమస్యలు తిరిగి తెచ్చే అవకాశం లేదని తాను నమ్ముతున్నట్లు జాన్ కీ తెలిపారు. ఫ్రాన్స్ తన చర్యలను పెద్ద లోపంగా భావించిందని, ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రధాని రాక ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుందని న్యూజిల్యాండ్ ప్రధాని కీ అభిప్రాయపడ్డారు.