
దూరం ఎక్కువైతే ఒత్తిడికి దగ్గరైనట్టే
పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు ఎక్కువ సార్లు వివిధ దేశాలు ప్రయాణించాల్సి వస్తుంది.
లండన్: పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు ఎక్కువ సార్లు వివిధ దేశాలు ప్రయాణించాల్సి వస్తుంది. దీంట్లో కొత్తేముంది.. హ్యాపీగా విమానాల్లో ప్రయాణిస్తూ, ఖరీదైన హోటళ్లలో ఎంజాయ్ చేయడమే కదా! ఎంత అదృష్టం అనుకుంటున్నారా? అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే అంటున్నారు లండన్ పరిశోధకులు. ఇలా చేయడం వల్ల వారికి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయినవాళ్ల ప్రేమాభిమానాలకు దూరమవడమే కాక ఒంటరిగా ఫీలయ్యి ఒత్తిడికి లోనవడంతో చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు తెలిపారు.
లండన్‌లోని సర్రే విశ్వవిద్యాలయం, స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఒంటరితనం, ఒత్తిడి, నిద్రలేమి, అధిక శ్రమ.. వంటి అనేక కారణాల వల్ల ఇలా అత్యధిక దూరాలు ప్రయాణం చేసే వారి జన్యువుల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఫలితంగా చివరికి కుటుంబం నుంచి విడిపోయే పరిస్థితులకు ఇవన్నీ దారితీస్తున్నాయని అన్నారు.