వేలిముద్రలు ఇవ్వకూడదని.. వేళ్లు తినేశాడు!
ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు తన వేలి ముద్రల ద్వారా తానెవరో తెలియకూడదనుకున్న ఓ వ్యక్తి.. తన చేతి వేళ్లను అప్పటికప్పుడే నమిలి తినేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఓహియో ఈశాన్యప్రాంతంలో జరిగింది. కిర్క్ కెల్లీ అనే ఈ వ్యక్తిని సాక్ష్యాలు ధ్వంసం చేయడంతో పాటు అధికారుల విధి నిర్వహణకు అడ్డుపడటం, అరెస్టును అడ్డుకోవడం లాంటి నేరాల కింద అరెస్టు చేసి జైల్లో వేశారు.
కెల్లీతో పాటు మరికొంతమంది ఉల్లంఘనులను ఓ క్రూయిజర్‌లో చేతులకు సంకెళ్లు లేకుండా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అతడితో పాటు మరికొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. తన పేరు కూడా అతడు తప్పుగా చెప్పాడని, ఫ్లోరిడాలో ఇతడు ఇంతకుముందు డ్రగ్స్ అమ్మకం, ఆయుధాల అక్రమ అమ్మకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. అక్కడి పోలీసులు పంపిన ఫొటోల ఆధారంగా గుర్తించి, అతడిని అరెస్టు చేశామన్నారు.