స్వలింగ దంపతులకు 85 కొరడా దెబ్బలు
స్వలింగ సంపర్కులైన ఇద్దరు పురుషులకు ఇండోనేషియాలోని షరియా కోర్టు 85 చొప్పున కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఆ శిక్షను కూడా బహిరంగంగా అమలుచేయాలని తెలిపింది. ఇటీవల ఇదే దేశంలో ఒక క్రిస్టియన్ రాజకీయ నాయకుడిని దేవుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారంటూ జైల్లో పెట్టిన తర్వాత.. ఇప్పుడు ఈ కొరడా దెబ్బల నిర్ణయం వెలువడింది. 20, 23 ఏళ్ల వయసున్న ఇద్దరు పురుషులు లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారిద్దరికీ బహిరంగంగా 85 చొప్పున కొరడాదెబ్బలు కొట్టాలని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు చదివే సమయంలో ఆ ఇద్దరిలో ఓ యువకుడు విపరీతంగా ఏడ్చి, తనను క్షమించాలని కోరాడు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే వీళ్లిద్దరికీ ఈ శిక్ష అమలు అవుతుందని చీఫ్ ప్రాసిక్యూటర్ గుల్మైనీ తెలిపారు.
రాష్ట్ర రాజధాని బందా అసెలో ఈ ఇద్దరూ ఒకే గది తీసుకుని ఉండటం, వాళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వీళ్ల చుట్టుపక్కల ఉండేవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మార్చి నెలాఖరులో వీళ్లను అరెస్టు చేశారు. వాళ్లిద్దరూ నగ్నంగా ఉండగా తీసిన మొబైల్ వీడియో ఫుటేజి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. వాళ్లిద్దరూ స్వలింగ సంపర్కులన్న విషయం చట్టబద్ధంగా రుజువైందని, అందువల్ల వాళ్లకు కొరడా దెబ్బలు విధించాలని జడ్జి ఖైరిల్ జమాల్ చెప్పారు. గరిష్ఠంగా వీళ్లకు 100 కొరడా దెబ్బల వరకు విధించే అవకాశం ఉన్నా, వాళ్లు కోర్టుతో మర్యాదపూర్వకంగా ఉండటంతో కొంత తగ్గించామన్నారు. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం ఇది అన్యాయమని, వాళ్లిద్దరినీ విడిచిపెట్టాలని అంటున్నాయి.